అప్రమత్తంగా ఉండాలని ఎన్‌బిఎఫ్‌సిలకు సూచన
న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో పసిడి రుణాల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది. బంగారం ధరల తగ్గుదలతో రుణాలకు సంబంధించిన లోన్ టు వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని సూచించింది. బంగారం తాకట్టు రుణాలపై నిర్దేశించిన 85 శాతం ఎల్‌టివి పరిమితిని కొన్ని రుణాలు దాటే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. తాకట్టు పెట్టే బంగారం విలువతో పోలిస్తే బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ ఎంత రుణం ఇస్తుందో తెలిపే నిష్పత్తినే ఎల్‌టివిగా భావిస్తారు. గత నెల రోజుల వ్యవధిలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి సుమారు 30–40 శాతం వరకు పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ధరల పతనంతో రుణాలకు తాకట్టుగా ఉన్న బంగారం విలువ తగ్గిపోవడం వల్ల రుణదాతల రిస్క్ పెరుగుతోంది. ఎల్‌టివి నిష్పత్తులు అధికంగా ఉన్న సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్‌బిఐ సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బంగారు రుణాల రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) కూడా పెరుగుతున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2026 ఆగస్టు చివరి నాటికి గోల్డ్ లోన్ల ఎన్‌పిఎలు 0.30 శాతానికి చేరాయి. మార్చి 31 నాటికి ఇవి 0.16 శాతంగా ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ పసిడి రుణ ఖాతాలు ఉన్న రుణగ్రహీతలు చెల్లింపులు ఆలస్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది.







కామెంట్‌లు (0)