సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు : మధ్యప్రదేశ్ హైకోర్టు

1 గంట క్రితం

ఆ నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు : మధ్యప్రదేశ్ హైకోర్టు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 01:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మధ్యప్రదేశ్ : మహిళల పునరుత్పత్తి హక్కులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాలా అనే నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేసింది. ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టం (Medical Termination of Pregnancy Act – MTP Act) కింద దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన ఇండోర్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.


అసలు కేసు ఏమిటంటే ....

పిటిషనర్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వైవాహిక విభేదాల కారణంగా భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడివిడి గా నివసిస్తున్నారు. ఈ సమయంలో మహిళ గర్భవతి కావడంతో ... గర్భాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తన వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో తాను మానసికంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, అలాంటి పరిస్థితుల్లో బిడ్డను కనడం, పెంచడం సాధ్యం కాదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాలా అనే నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు అని, ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ... గర్భాన్ని కొనసాగించాలా లేక అబార్షన్ చేయించుకోవాలా అనే నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ, హక్కు ఆ మహిళకు మాత్రమే ఉన్నాయి. ఇష్టం లేని గర్భాన్ని మోయాలని ఏ మహిళను, బాలికను బలవంతం చేసే హక్కు భర్తకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ, ఏ న్యాయస్థానానికి గానీ లేదని హైకోర్టులు, సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేశాయి. భార్యాభర్తలు విడిగా జీవిస్తున్నా లేదా విడాకుల ప్రక్రియలో ఉన్నా, గర్భస్రావం చేయించుకోవడానికి భర్త అనుమతి తప్పనిసరి కాదని స్పష్టం చేశాయి. అవివాహితలకూ సమాన హక్కులు వైద్యపరమైన గర్భస్రావ చట్టం (MTP Act) ప్రకారం ... పెళ్లి అయిన వారితో సమానంగా అవివాహితలు కూడా సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కు కలిగి ఉన్నారు. 20 వారాల వరకు ఒకరిద్దరు రిజిస్టర్డ్ వైద్యుల సలహాతో, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చు. మైనర్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలు లైంగిక దాడికి గురైన మైనర్ బాలికల విషయంలో న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. బాలిక భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. గర్భం గడువు 24 వారాలు దాటినప్పటికీ అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టులు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్