మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌తో రక్ష‍ణ ఒప్పందం... ఓ భారీ కుంభకోణం

3 రోజుల క్రితం

defence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:41 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- నెకో డిఫెన్స్ మునిషన్స్ కు ముందస్తు చెల్లింపులు

- ఎస్టోనియా రక్ష‍ణ మంత్రి రాజీనామా

తల్లిన్: భారత్‌కు చెందిన కార్పొరేట్‌ సంస్థల అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు విదేశాల్లోనూ బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కెన్యాలో టాటా కెమికల్స్‌ సంస్థ చట్ట ఉల్లంఘనల ఉదంతం మరవకముందే ఎస్టోనియాలో భారత్‌కే చెందిన మరో కంపెనీ అక్రమాలు గుట్టు రట్టు అయ్యింది. దీంతో ఏకంగా ఆ దేశ రక్ష‍ణ శాఖ మంత్రి రాజీనామా చేయాల్సివచ్చింది. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..

మందుగుండు సామగ్రి విక్రయంతో ఏ మాత్రం సంబంధం లేని ఓ భారతీయ సంస్థ ప్రమేయంతో కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందానికి సంబంధించిన రూ.768.50 కోట్ల (70 మిలియన్ యూరోలు) కుంభకోణం బయటపడడంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కుర్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌కు సాయం కోసం ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు. 2022 నుంచి పెవ్‌కుర్ ఎస్టోనియా రక్షణ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎస్టోనియా జాతీయ ఆడిట్ కార్యాలయం కీలక సమాచారాన్ని బయటపెట్టిన నేపథ్యంలో రక్షణ ఒప్పందానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ఫెవ్‌కుర్ ప్రకటించారు. ‘ఎస్టోనియా భద్రత అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిందో కాదు. అది మనందరి ఉమ్మడి బాధ్యత. అందుకే నేను రక్షణ రంగానికి రాజకీయ బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను. ఈ రంగం యొక్క బాధ్యతలను ప్రధానికి అప్పగిస్తున్నాను’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదికలో తెలియజేశారు.

సరఫరాలు జరగక ముందే చెల్లింపులు

ఎస్టోనియాకు చెందిన సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక కొనుగోళ్లు, సైనిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, సైనిక ఆస్తుల నిర్వహణను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ 2024లో డేటాసెల్ ఎస్‌ఆర్‌ఎల్ అనే సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది ఇటలీలో రిజిస్టర్ అయిన కంపెనీ. దీనిని అదే సంవత్సరం ప్రారంభంలో భారత్‌కు చెందిన నెకో డిఫెన్స్ మునిషన్స్ కొనుగోలు చేసింది. రష్యాతో యుద్ధంలో తీవ్రమైన మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఫిరంగి గుండ్లను సమకూర్చడం ఈ ఒప్పంద ఉద్దేశం. ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరోపియన్ పీస్ ఫెసిలిటీ నిధులను ఎస్టోనియా వినియోగించింది. అంతేకాదు...ఆ కంపెనీకి ముందుగానే అనేక మిలియన్ యూరోలు చెల్లించింది. ఈ విధంగా ముందస్తు చెల్లింపులు సుమారు 70 మిలియన్ యూరోలకు చేరాయి. అంటే దాదాపుగా చెల్లింపులన్నీ ముందస్తుగానే జరిగిపోయాయన్న మాట.

అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి చేరిన వివాదం

ఎస్టోనియా 2024 ఆగస్టులో మొదటి ఒప్పందంపై సంతకం చేసి సుమారు పదిహేను మిలియన్ యూరోలను ముందస్తుగా చెల్లించింది. అక్టోబరులో మరో ఒప్పందంపై సంతకం చేసి 10 మిలియన్ యూరోలను చెల్లించింది. ఆ సంవత్సరం చివరి నాటికి మరికొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తంగా సుమారు 70 మిలియన్ యూరోలను చెల్లించింది. ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే మందుగుండు సామగ్రి ఉక్రెయిన్‌కు చేరాల్సి ఉంది. అయితే ఉత్పత్తితో సమస్యలు తలెత్తాయని చెబుతూ సరఫరాలను పదే పదే ఆలస్యం చేశారు. చివరికి గత సంవత్సరం మందుగుండు సామగ్రి సరఫరా జరిగినప్పటికీ అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఈస్టి ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చివరికి ఈ వివాదం అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి చేరగా ఎస్టోనియాపై డేటాసెల్ కంపెనీ దావా వేసింది. ఒప్పందాల కారణంగా డేటాసెల్ తీవ్రంగా నష్టపోయిందని ఆ సంస్థ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. ఒప్పందాలను రద్దు చేయడానికి ఎస్టోనియా సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చెప్పిన కారణాలు, కంపెనీ చర్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఆ నిధులు ఎక్కడ?

ఎస్టోనియా ప్రభుత్వ రక్షణ పెట్టుబడుల కేంద్రం (ఆర్‌కేఐఎస్) నుంచి ముందస్తుగా 59 మిలియన్ యూరోల చెల్లింపులు జరిగాయని డేటాసెట్ ధృవీకరించింది. కొనుగోలు విలువ 70 మిలియన్ యూరోలని ఆర్‌కేఐఎస్ అంచనా వేసిందని, అలాంటప్పుడు మిగిలిన నిధులు ఎక్కడ ఉన్నాయని ఈస్టి ఎక్స్‌ప్రెస్ పత్రిక తన కథనంలో ప్రశ్నించింది. కాగా మందుగుండు సామగ్రిలో నాణ్యత లేదంటూ వచ్చిన ఆరోపణలను డేటాసెల్ తోసిపుచ్చింది. సకాలంలో మందుగుండు సామగ్రి సరఫరా కాకపోవడంతో డేటాసెల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలను గత సంవత్సరం రద్దు చేసుకున్న ఆర్‌కేఐఎస్... ముందస్తుగా చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని డిమాండ్ చేసింది. మందుగుండు సామగ్రి కోసం చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఎస్టోనియా ప్రభుత్వం ఈ వివాదాన్ని ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న వాణిజ్య వివాదాల పరిష్కార కేంద్రం వద్దకు తీసుకుపోయింది.

ముందస్తు చెల్లింపులు సరికాదు

‘ఇల్లు కట్టడం మొదలు పెట్టి గృహ నిర్మాణంతో ఇంతకుముందు ఎన్నడూ సంబంధం లేని కంపెనీకి ఆ పని అప్పగిస్తే ఇల్లు పూర్తికాదనే సందేహం కలుగుతుంది కదా. ముందస్తుగా డబ్బు చెల్లించడం సరికాదు’ అని సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ జనరల్ ఎల్మార్ వాహెర్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా ఈయూ నిధులను తిరిగి పొందడంలో విఫలమైతే ఎస్టోనియా తన సొంత బడ్జెట్ నుంచి దానిని భరించాల్సి ఉంటుందని పర్యవేక్షక సంస్థ హెచ్చరించింది. కాగా వివాదాస్పద నిధుల విషయంలో యూరోపియన్ కమిషన్ కూడా ఎస్టోనియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. రాజీనామా చేసిన మంత్రి పెవ్‌కుర్‌ను ప్రధాని క్రిస్టెన్ వెనకేసుకొచ్చారు. ఈ ఉదంతంలో ఆయన వ్యక్తిగత బాధ్యత ఏమీ లేనప్పటికీ రాజకీయ బాధ్యత ఉంటుందని చెప్పారు.

ఉక్రెయిన్ మద్దతుదారుగా...

సుమారు 12 లక్షల జనాభా కలిగిన చిన్న దేశం ఎస్టోనియా అటు ఈయూలోనూ, ఇటు నాటోలోనూ సభ్యత్వాన్ని కలిగి ఉంది. రష్యాతో సరిహద్దును పంచుకుంటోంది. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధం ఎస్టోనియాలో భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఎస్టోనియా ప్రభుత్వం ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్