నీట్ నిరసనకారులపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
అధికరణ 142 కింద సుప్రీం ఉత్తర్వులు
తలొగ్గి కేసుల ఉపసంహరణను ప్రకటించిన కేంద్రం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : పోరాటపంథాలో యువతరం విజయపరంపర కొనసాగిస్తోంది. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విద్యా రంగ ప్రక్షాళన కోసం శాంతియుతంగా పోరు సల్ఫిన నిరసనకారులపై అన్యాయంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నిటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారత రాజ్యాంగం అధికరణ 142 కింద తనకు కల్పించిన అధికారాలను ఉపయోగించుకొని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఆ వెంటనే నీట్ నిరసనలకు సంబంధించిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. వైద్య విద్యా కోర్సులకు సంబంధించి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశాల పరీక్ష (నీట్) ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యా రంగ ప్రక్షాళన కోసం కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి), భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) తదితర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శాంతియుత నిరసనలు చేపట్టి..చలో పార్లమెంటు మార్చ్ నిర్వహించి మోడీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. విద్యార్థుల ఉద్యమాన్ని అణిచేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు అమానవీయరీతిలో దాడులకు పాల్పడ్డారు. అటు ఢిల్లీలోనూ, ఇటు బిజెపి, దాని మిత్ర పక్షాల అధికారంలోని పలు రాష్ర్టాల్లో వేలాది మంది నిరసనకారులపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకతప్పలేదు. అదే సమయంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీల్లో కేసులు ఉపసంహరణ కూడా కీలకమైనది. విద్యార్థులు ఆందోళనను విరమించిన తర్వాత కేంద్రం మాట మార్చి హామీలపై నీళ్లు కుమ్మరించేందుకు ప్రయత్నించింది. దీంతో సిజెపి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థులపై కేసులను కొట్టివేయాల్సిందేనని విన్నవించింది. ఈ నేపథ్యంలో భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం సంబంధిత పిటిషన్లపై మంగళవారం నాడు విచారణ చేపట్టింది. వాదనల అనంతరం నీట్-యుజి నిరసనలకు సంబంధించి ఆందోళనకారులపై ఈ ఏడాది జులై 20-25 మధ్య నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ రాజ్యాంగంలోని 142 అధికరణ కింద కొట్టివేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. నిరసనకారుల పక్షాన హాజరైన సిజెపి కో కన్వీనర్ సౌరవ్ దాస్ వాదనలు వినిపిస్తూ..ఈ నెల 5న చేయతలపెట్టిన నిరసన ప్రదర్శనను రద్దు చేసుకుంటామని తెలియచేశారు. ఆందోళనకారులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహ రించుకుంటామని, బాధితులకు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం హామీలివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటనీ మూసివేసేందుకు గల అధికారాలను వినియోగించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వ పక్షాన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టును కోరారు. సిజెపి నేతలకు జులై 25న ఇచ్చిన హామీలను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌ల రద్దు కోసం దరఖాస్తులు దాఖలు చేసినట్లు ధర్మాసనానికి తుషార్ మెహతా విన్నవించారు. నీట్ పరీక్షను రద్దు చేయడంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా వుందన్నారు. అయితే ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించేందుకు 3 నెలల గడువు కావాలని అభ్యర్థించారు. దీంతో జులై 20-25 మధ్య నమోదైన సంబంధిత ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని సుప్రీం ఆదేశించింది. తాజాగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దంటూ రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరే స్వేచ్ఛ కేంద్రానికి వుందని బెంచ్ పేర్కొంది. పోలీసు చర్యల్లో గాయపడిన వారికి నష్టపరిహారం అందించేందుకు ఒక పథకాన్ని రూపొందించాలని, అందుకోసం విధి విధానాలను సిద్ధం చేయాలని కూడా కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఆ పథకం ఖరారైన తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దాన్ని ఆమోదించాలని, ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు ఉపయోగించాలని కోరింది. అయితే కేంద్రం అభ్యర్థన మేరకు జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న తీవ్రమైన నేరచరిత్ర కలిగిన 2,873 మందిపై మాత్రం ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రాణనష్టం లేదా ఆస్తి విధ్వంసంలో వారి పాత్రపై దర్యాప్తు చేయాలని సూచించింది.
అన్ని కేసులూ ఉపసంహరించుకుంటాం : జెపి నడ్డా
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి నమోదైన కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇటీవల ఢిల్లీలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 5న తలపెట్టిన నిరసనను సిజెపి విరమించుకోవడాన్ని కూడా నడ్డా స్వాగతించారు. ఈ నేపథ్యంలో బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఆయా రాష్ట్రాల పరిధిలో సిజెపి నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)