ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అవయవ దానంలో లింగ అసమానతలు...

2 గంటల క్రితం

organs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 06:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అత్యధికం 68 శాతం మహిళలే

- గ్రహీతల్లో పురుషులు 78 శాతం మంది

- కేంద్ర వార్షిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : తన శరీరంలోని అవయవాన్ని కుటుంబ సభ్యుడి ప్రాణాల కోసం త్యాగం చేస్తున్నది ఎక్కువగా మహిళలే... కానీ ఆ అవయవంతో కొత్త జీవితం పొందుతున్నది మాత్రం పురుషుడే. భారత్‌లో అవయవ మార్పిడి వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. దాతలు, గ్రహీతల మధ్య లింగ అసమానత స్పష్టంగా కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఒటిటిఒ) 2025 వార్షిక నివేదిక వెల్లడించింది. దేశంలో జీవించి ఉన్న అవయవ దాతల్లో 68 శాతం మంది మహిళలు, అవయవాలను పొందినవారిలో 78 శాతం మంది పురుషులు ఉన్నారు. ​2025లో మొత్తం 16,614 మంది జీవించి ఉన్న అవయవ దాతలు కాగా.. వారిలో 11,316 మంది, అంటే 68 శాతం మంది మహిళలే. ఇక పురుషుల సంఖ్య 5,298గా, అంటే 32 శాతంగా ఉంది. ఇక అవయవాలు పొందిన వారిలో అత్యధికం 12,903 మంది (78 శాతం) పురుషులే ఉన్నారు. అవయవ గ్రహీతల్లో మహిళల సంఖ్య 3,707 (22 శాతం) గానే ఉండటం గమనార్హం.

​కిడ్నీ, కాలేయ మార్పిడులే అత్యధికం

దేశంలో అత్యధికంగా జరిగే అవయవ మార్పిడులు కిడ్నీ, కాలేయానికి సంబంధించినవే. 2025లో కిడ్నీ దాతల్లో 71 శాతం, అంటే 8,835 మంది మహిళలు ఉన్నారు. పురుషులు 29 శాతం (2,835 మంది)గా ఉన్నారు. కిడ్నీ పొందినవారిలో 77 శాతం మంది (9,656 మంది) పురుషులు ఉంటే.. 23 శాతం (2,835 మంది) గానే మహిళలు ఉండటం గమనార్హం. కాలేయ మార్పిడిలో 60 శాతం మంది (2,480 మంది) దాతలు మహిళలు కాగా.. 40 శాతం మంది (1,642 మంది) పురుషులు ఉన్నారు. గ్రహీతల్లో 79 శాతం (3,248 మంది)తో పురుషులు ఉండగా.. మహిళల సంఖ్య కేవలం 21 శాతం (871 మంది)గా ఉంది. 2025లో ఒక మహిళ తన కుటుంబంలోని పురుష వ్యక్తికి చిన్న ప్రేగు (స్మాల్‌ బవెల్‌)ను కూడా దానం చేసినట్టు నివేదిక పేర్కొంది.

​20వేలకు పైగా శస్త్రచికిత్సలు

దేశంలో 2025లో 20,138 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఒకే ఏడాదిలో నమోదైన అత్యధిక సంఖ్య ఇదే కావడం గమనార్హం. 2013లో ఈ సంఖ్య 4,990 మాత్రమే ఉండగా.. ఇప్పుడు నాలుగు రెట్లకు పైగా పెరిగింది. 2024తో పోలిస్తే 2025లో 6.5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మార్పిడుల్లో కిడ్నీ మార్పిడులు 62.03 శాతం, కాలేయ మార్పిడులు 20.46 శాతం వాటా కలిగి ఉన్నాయి.

​మృతదేహాల నుంచీ...

మృతదేహాల నుంచి అవయవదానం ద్వారా జరిగే మార్పిడులు కూడా గణనీయంగా పెరిగాయి. 2013లో వీటి సంఖ్య 837 ఉండగా.. 2025లో అవి 3,526కు చేరాయి. మృతదేహాల నుంచి జరిగిన కిడ్నీ మార్పిడులు 2022లో 1,541, 2023లో 1,635, 2024లో 1,918, 2025లో 1,986 నమోదయ్యాయి.

​గణాంకాలు ఇలా..

జీవించి ఉన్న దాతల నుంచి జరిగిన కిడ్నీ మార్పిడులు 2022లో 10,164, 2023లో 11,791, 2024లో 11,558, 2025లో 12,491కి చేరాయి. కాలేయ మార్పిడులు 2022లో 3,920, 2023లో 4,491, 2024లో 4,901, 2025లో 5,154 నమోదయ్యాయి. కిడ్నీ-ప్యాంక్రియాస్‌ మార్పిడులు 2024లో 37 ఉండగా.. 2025 లో 26కు తగ్గాయి. స్మాల్‌ బవెల్‌ మార్పిడులు 224లో 9 నుంచి 2025లో 23కు పెరిగాయి.

అవయవదానానికి ఐదు లక్షల మంది నమోదు

2023లో ప్రారంభించిన జాతీయ డిజిటల్‌ అవయవ దాన ప్రతిజ్ఞ (ప్లెడ్జ్‌) పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి పైగా ఆధార్‌ ధృవీకరణతో అవయవదానానికి నమోదు చేసుకున్నారు. ఒక మృతదేహ అవయవ దాత ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడగలదని ఎన్‌ఓటీటీఓ పేర్కొంది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్