గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏడు నెలల గరిష్టానికి తయారీ రంగం

1 గంట క్రితం

manufacturing sector
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 12:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత తయారీరంగ వృద్ధి సెప్టెంబర్‌లో ఏడు నెలల గరిష్టానికి చేరింది. బలమైన దేశీయ, ఎగుమతి డిమాండ్‌ నేపథ్యంలో అమ్మకాలు, ఉత్పత్తి పెరగడంతో పాటు ఉద్యోగాల కల్పన కూడా గణనీయంగా పెరిగినట్లు గురువారం విడుదలైన నెలవారీ సర్వే వెల్లడించింది. భవిష్యత్‌ వ్యాపారంపై సానుకూల అంచనా కూడా నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. సీజనల్‌గా సర్దుబాటు చేసిన హెచ్‌ఎస్‌బిసి ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) ఆగస్టులో 52.8గా ఉండగా, సెప్టెంబర్‌లో 55.1కి పెరిగింది. దీంతో గత ఏడు నెలల్లో తయారీ రంగ కార్యకలాపాల్లో అత్యంత బలమైన వృద్ధి నమోదైంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్లు పెరగడంతో తయారీ సంస్థలు ఉత్పత్తిని విస్తరించాయి. గత నెలలో స్వల్పంగా మందగించిన ఉద్యోగాల కల్పన సెప్టెంబర్‌లో తిరిగి పుంజుకుంది. మే తర్వాత ఉద్యోగాల విస్తరణ ఇదే అత్యంత వేగవంతమైనదని సర్వే పేర్కొంది. ఎలక్ట్రానిక్స్‌, ఆహారం, ఫార్మా, వస్త్ర రంగాల్లో బలమైన డిమాండ్‌ కారణంగా మొత్తం అమ్మకాల వృద్ధి ఫిబ్రవరి తర్వాత అత్యధిక స్థాయికి చేరింది.

ఎగుమతి ఆర్డర్లు కూడా గణనీయంగా పెరిగాయి. బ్రెజిల్‌, యూరప్‌, యుఎఇ, అమెరికా నుండి వచ్చిన ఆర్డర్లతో ఎగుమతులు పెరిగాయి. భవిష్యత్తులో డిమాండ్‌ మరింత బలపడుతుందన్న అంచనాలతో కంపెనీలు ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన ముడిసరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వలను పెంచుకున్నాయి. తయారైన ఉత్పత్తుల నిల్వలు కూడా వరుసగా మూడో నెలలో పెరిగినట్లు నివేదిక తెలిపింది. ముడిసరుకుల వ్యయం, ఉత్పత్తుల అమ్మకపు ధరలు సెప్టెంబర్‌లో వేగంగా పెరిగినప్పటికీ, చారిత్రక ప్రమాణాలతో పోలిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మితంగానే ఉన్నాయని సర్వే పేర్కొంది. రానున్న నెలల్లో కొత్త ఆర్డర్లు, బలమైన డిమాండ్‌ కొనసాగుతాయన్న అంచనాలతో తయారీదారుల వ్యాపార సానుకూల అంచనా నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్