ప్రణాళికలో యాత్రికుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి-విజయవాడ : గోదావరి పుష్కరాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.4 వేల కోట్ల నిధులను యాత్రికుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఖర్చు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చేపట్టాల్సిన పనుల నిర్ణయం త్వరగా జరగాలని, తగినంత ముందుగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. గతంలో పనుల నిర్ణయం, ప్రారంభం, పూర్తి చేయడం చాలా ఆలస్యంగా జరిగి యాత్రికులకు సకాలంలో తగు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కనిపించిందన్నారు. పనులు హడావుడి చేయడం వల్ల తీవ్ర నాణ్యత లోపం, భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలు జరిగాయన్న వార్తలు వచ్చాయని.. చేసిన కొన్ని పనులు పుష్కరాలు జరుగుతుండగానే దెబ్బతిన్నాయన్నారు. తీర్థయాత్రలు, పుష్కరాలు, ఉత్సవాల్లో యాత్రికుల ప్రాణాలను, భద్రతను గాలికొదిలేస్తున్నారని.. గత పుష్కరాల్లో భద్రతా వైఫల్యం, ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర అశ్రద్ధ స్పష్టంగా కనబడ్డాయన్నారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ఆదుకోలేదు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులు అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా ఉండేలా, అవినీతికి తావు లేకుండా చూడాలని, వీటిపై నిరంతర పర్యవేక్షణకు “పబ్లిక్ ఆడిట్ ” ఉండాలని డిమాండ్ చేశారు. పనుల నిర్వహణలో అధికార దుర్వినియోగం, రాజకీయజోక్యం లేకుండా చేయాలన్నారు. పనుల నాణ్యతకు, భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా ముందునుండే తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు.







కామెంట్‌లు (0)