- సుప్రీంకోర్టుకు రెండువేల మందికి పైగా పౌరుల విజ్ఞప్తి
- ఇసిఐ పనితీరుపై సుమోటోగా విచారణ చేపట్టాలని వెల్లడి
- సుప్రీంకోర్టు సిజెఐ, న్యాయమూర్తులకు బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం పనితీరుపై అత్యవసరంగా న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని కోరుతూ రెండువేల మందికి పైగా విద్యావేత్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, రచయితలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, మాజీ అధికారులు, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు బహిరంగ లేఖ పంపారు. సర్‌ను తక్షణమే నిలిపివేయాలనీ, ఎన్నికల సంఘం వ్యవహారాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని వారు కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య సంబంధాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, పౌర సమాజ సంస్థలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే లేఖలోని ఆరోపణలు, వాదనలపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ఫామ్-6లో మార్పులపై అభ్యంతరం
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారి కోసం ఉపయోగించే ఫామ్-6లో గత సర్ జాబితాల్లో తమ పేరు లేదా తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయా అనే వివరాలను ప్రకటించేలా మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈ మార్పునకు చట్టపరమైన ఆధారం లేదనీ, ఇది అనధికారికమని ఎన్నికల కమిషనర్ సంధు ఫైల్‌లో పేర్కొన్నట్టు లేఖలో వివరించారు. దీంతో తొలిసారి ఓటర్లుగా నమోదు కావాలనుకునే యువతకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల్లో పేర్లను చేర్చడం, తొలగించడం, మార్పులు చేయడం వంటి అధికారాలు స్థానిక ఎన్నికల నమోదు అధికారులకే ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టం చెప్తోందని పిటిషన్ పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ స్థానిక అధికారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని ఆరోపించింది. గోవాలో పత్రాలు పరిశీలించి 97 మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించేందుకు స్థానిక అధికారులు అనుమతి ఇచ్చినా, సాఫ్ట్‌వేర్‌లోని పరిమితుల కారణంగా వాటిని తుది జాబితాలో పునరుద్ధరించలేకపోయారని లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఓటర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించి భారీ సంఖ్యలో అప్పీలు నమోదయ్యాయని వారు వివరించారు.
కోట్లాది మంది ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళన
సర్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల్లో 13 కోట్ల మందికి పైగా ఓటర్ల పేర్లు తొలగించబడినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పేర్ల తొలగింపు జరిగితే ప్రతి ఓటరుకు తగిన నోటీసు, విచారణ, అప్పీల్ అవకాశాలు కల్పించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని బహిరంగ లేఖపై సంతకం చేసిన వారు సందేహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ ఐదు ప్రధాన డిమాండ్లు
సర్, ఇసిఐనెట్ వ్యవహారాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలనీ, విచారణ పూర్తయ్యే వరకు సర్‌ను నిలిపివేయాలని బహిరంగ లేఖ కోరింది. ఎన్నికల నమోదు ప్రక్రియలో జరిగినట్టు ఆరోపిస్తున్న మార్పులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలనీ, ఇసిఐనెట్ సాఫ్ట్‌వేర్‌పై స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. సాంకేతిక లోపాలు లేదా అనధికారిక చర్యల కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారి పేర్లను తిరిగి చేర్చాలని కోరింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది. ఓటర్ల జాబితా తయారీ, సవరణలో పారదర్శకత, న్యాయబద్ధమైన విధానం ఉండాలని వారు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలవాలంటే ఎన్నికల సంఘం నిర్ణయాలు పారదర్శకంగా, చట్టబద్ధంగా, అందరు సభ్యుల సమిష్టి నిర్ణయాలతో సాగాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)