- స్టాటిస్టికల్ మెకానిక్స్‌లో పరిశోధనకు గానూ 2026 డిరాక్ మెడల్ అవార్డు
- సిపిఎం నేత బేబీ అభినందనలు
న్యూఢిల్లీ : భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్ర్తవేత్త దీపక్ ధర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ (గణాంక యాంత్రిక శాస్త్రం), సంక్లిష్టమైన వ్యవస్థల పనితీరులో ప్రభావవంతమైన పరిశోధన జరిపినందుకు గానూ ప్రొఫెసర్ దీపక్ ధర్‌కు 2026 డిరాక్ మెడల్ లభించింది. ఈ పురస్కారాన్ని మరో ముగ్గురు శాస్ర్తవేత్తలతో కలిసి పంచుకున్నారు. స్టాటిస్టికల్ మెకానిక్స్‌లో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఐసిటిపి (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియోరిటికల్ ఫిజిక్స్) ఈ అవార్డును అందచేసింది. ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసిన నలుగురు భౌతిక శాస్త్రవేత్తల్లో దీపక్ ధర్ ఒకరు. బెంగళూరులోని ఐసిటిఎస్-టిఐఎఫ్‌ఆర్‌లో ప్రస్తుతం ఐఎన్‌ఎస్‌ఎ ప్రొఫెసర్‌గా వున్నారు.
ఒక వ్యవస్థలోని వేర్వేరు భాగాల మధ్య జరిగే సాధారణమైన పరస్పర చర్యలు ఆ వ్యవస్థ పెద్దదిగా మారినపుడు సంక్లిష్టమైన పనితీరును ఎలా ఉత్పత్తి చేస్తాయో శాస్త్రవేత్తలు అర్ధం చేసుకోవడానికి ధర్ చేసిన పరిశోధన ఉపయోగపడిందని ఐసిటిపి పేర్కొంది. తన పరిశోధనలకు గానూ ధర్ ఇప్పటికే అనేక ప్రధాన అవార్డులు అందుకున్నారు. 2023లో భారత ప్రభుత్వం పద్మ భూషణతో సత్కరించింది. 1991లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కూడా అందుకున్నారు.
సిపిఎం నేత బేబీ అభినందనలు
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న ప్రొఫెసర్ దీపక్ ధర్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ట్వీట్ చేశారు.







కామెంట్‌లు (0)