రాం జెఠ్మలానీ స్మారకోపన్యాసంలో సిజెఐ జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ : ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న ఏకైక నిజమైన సంపద అని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులో కేసు ఓడిపోయిన వ్యక్తి కూడా, న్యాయవ్యవస్థ తనతో న్యాయంగా వ్యవహరించిందనే నమ్మకంతో ఉండాలని చెప్పారు. తాను ఆశించిన తీర్పు రాలేదని భావించినంత మాత్రాన న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోకూడదన్నారు. అయితే, విచారణలో తమతో అన్యాయంగా వ్యవహరించారని ప్రజలు భావిస్తే మాత్రం న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ది లీలా ప్యాలెస్ హోటల్‌లో సోమవారం నాడు ప్రముఖ న్యాయకోవిధులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది రాం జెఠ్మలానీ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిజెఐతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘావాల్, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదన్నారు. జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) పాఠ్యపుస్తకానికి సంబంధించిన సుమోటో విచారణను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. న్యాయవ్యవస్థ ఒక సంస్థగా విమర్శలకు విముఖంగా ఉండదని, ఉండకూడదని ఆ సందర్భంగా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ పనితీరుపై నిష్పక్షపాతమైన, సమాచారంతో కూడిన, నిర్మాణాత్మక విమర్శలు చైతన్యవంతమైన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన, అవసరమైన అంశాలని సిజెఐ అన్నారు. ఇలాంటి విమర్శలు సంస్థాగత జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు న్యాయవ్యవస్థలో స్వీయ దిద్దుబాటుకు కూడా దోహదపడతాయని చెప్పారు. సాధారణ ప్రజలకు న్యాయస్థానాలు తరచుగా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయని చెబుతూ కోర్టుల్లో అనుసరించే విచారణ విధానాలు కూడా చాలా సందర్భాల్లో సంక్లిష్టంగా ఉంటాయని చెప్పారు. న్యాయపరమైన అంశాలను అర్థం చేసుకున్న న్యాయవాదులను నియమించుకునే స్థోమత ఉన్నవారికి ఈ విధానాలు సూక్ష్మంగా అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
'ఫిక్సర్ లాయర్ల'పై మహేష్ జెఠ్మలానీ ఆందోళన
సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, ట్రిబ్యునళ్లలో అవినీతికి పాల్పడుతున్న 'ఫిక్సర్ లాయర్ల' పాత్రపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి న్యాయవాదుల గుర్తింపులు అందరికీ తెలుసని మహేష్ జెఠ్మలానీ అన్నారు. వారి వివరాలను సుప్రీంకోర్టు కొలీజియంతో పంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలవాలంటే ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.






కామెంట్‌లు (0)