భారీ ర్యాలీలో లక్షలాది జనం
ముగిసిన సిపిఎం కేరళం రాష్ట్ర సమావేశాలు
ప్రజాపోరాటాలు నిర్వహిస్తాం : గోవిందన్ మాష్టార్
కోజికోడ్: కేరళంలోని కోజీకోడ్ సముద్ర తీరం ఎరుపెక్కింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేరళం రాష్ట్ర విస్తృత సమావేశాల ముగింపు సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఈ బహిరంగ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. కార్మిక వర్గ ఉద్యమ శక్తిని చాటిచెబుతూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం ఈ మహారాలీలో పాల్గొన్నారు. సాయంత్రం కడలి తీరంలోని స్వాతంత్ర్య చత్వరంలో జరిగిన ఈ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్, ఎం వి గోవిందన్, ఎ విజయరాఘవన్ తదితరులు ప్రసంగించారు.
సంస్థాగతంగా, సైద్ధాంతికంగా పార్టీని బలోపేతం చేసేలా నిర్ణయాలు: ఎం వి గోవిందన్ మాష్టార్
విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశంలో సంస్థాగతంగా, సైద్ధాంతిక అంశాలతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్ర కార్యదర్శి ఎం వి గోవిందన్ తెలిపారు. అన్ని రకాల మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న యుడిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని వామపక్ష భావజాలాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)