సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతి చాంపియన్‌షిప్‌ స్పోర్ట్స్ ప్రారంభం

1 గంట క్రితం

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి మండిపల్లి

ప్రజాశక్తి - తిరుపతి టౌన్ : తిరుపతి ఎన్‌‌టిఆర్‌ స్టేడియం వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఆగస్టు 27 వరకు కొనసాగానున్నాయని క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి వేదికగా సోమవారం ప్రారంభమైన ఈ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంఎ‌ల్‌‌సిలు, ఎంఎల్ఎలు, కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్‌‌పి సుబ్బరాయుడు, హాకీ క్రీడాకారిణి రజిని పాల్గొన్నారు. 26 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా క్రీడా, రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో సుమారు 2,07,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, జిల్లా స్థాయిలో సుమారు 84 వేలు మంది పోటీపడగా, ప్రతిభ కనబరిచిన 9,911 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. 12 క్రీడా విభాగాల్లో అండర్–17, అండర్–23 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రూ.92 లక్షల ప్రైజ్ మనీతో పాటు గుర్తింపు, ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రవి నాయుడు ప్రారంభించారు. తొలిరోజు అండర్‌-17, అండర్‌-23 విభాగాల్లో బ్యాడ్మింటన్‌, హాకీ, బాస్కెట్‌‌బాల్‌, ఖోఖో తదితర పోటీలు జరిగాయి.

​హోంమంత్రి అనితకు గాయం

అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభ వేడుకల్లో హోం మంత్రి అనితపై డ్రోన్‌ ‌కూలడంతో ఆమె కుడి చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే వైద్యసిబ్బంది అనితకు చికిత్స అందజేశారు. అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో భాగంగా అనిత డ్రోన్‌ ఎగురవేశారు. అయితే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందపడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్