ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చక్కెర ఫ్యాక్టరీలను తెగనమ్ముతారా...?

1 గంట క్రితం

sugar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 29 చక్కెర ఫ్యాక్టరీలతో కళకళలాడిన చెరకు పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రస్తుత సీజన్లో కేవలం మూడు ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. విజయనగరం జిల్లా సంకిలికి చెందిన ఎన్.సి.ఎస్ చక్కెర ఫ్యాక్టరీ 2027-28 సీజన్ కు క్రషింగ్ నిలిపి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి పట్టుకొమ్మగా ఉన్న చెరకు పరిశ్రమను బలోపేతం చేయాల్సిన సమయంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలను విక్రయించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 250 ద్వారా శ్రీవిజయరామ గజపతి కో-ఆపరేటివ్ షుగర్స్, ఏటికొప్పాక కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ సొసైటీ, తాండవ కో-ఆపరేటివ్ షుగర్స్, ఎన్విఆర్ అండ్ ఏ డి ఆర్ కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్, కడప కో-ఆపరేటివ్ షుగర్ లిమిటెడ్, అనకాపల్లి వివి రమణ కో-ఆపరేటివ్ షుగర్ లిమిటెడ్ , కోవూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్, చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ లిమిటెడ్...మొత్తం ఎనిమిది ఫ్యాక్టరీలను లిక్విడేషన్ కు అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడింది. జంపని ఫ్యాక్టరీ చాలా సంవత్సరాల క్రితమే మూతబడింది. సహకార రంగంలో పనిచేస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ అయిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఈ సీజన్లో మూతపడేలా చేశారు. ఫ్యాక్టరీల సహకార సంఘాల జనరల్ బాడీ ఆమోదం, సమ్మతి లేకుండా వాటిని విక్రయించాలని నిర్ణయించడం పూర్తిగా చట్ట విరుద్ధం.

ఇప్పుడు మూసివేయాలని ప్రకటించిన ఎనిమిది సహకార చక్కెర ఫ్యాక్టరీలకు వున్న భూములను అమ్మితే దాదాపు రూ.2500 కోట్లు వస్తాయి. ఈ ఫ్యాక్టరీలలోని యంత్రాలు, ఇతర సామగ్రి కలిపితే మొత్తం వాస్తవ విలువ రూ. 3 వేల కోట్ల పైనే ఉంటుంది. అయితే ఈ ఫ్యాక్టరీలకు ఉన్న అప్పులను మొత్తంగా చూస్తే రూ.1300 కోట్లకు మించవు. అటువంటప్పుడు మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించటానికి ప్రయత్నాలు చేయటానికి బదులు తెగ నమ్మటానికి సిద్ధపడటం ద్వారా కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను కాపాడదలుచుకుందో తేలిగ్గా అర్థం అవుతుంది. ఎన్నికల సమయంలో మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదా!

మన వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేసుకోవాలనేది ప్రాథమిక సూత్రం. కానీ మన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఓట్ల కోసం రైతు దేశానికి వెన్నెముక అంటూ ఆచరణలో రైతు వెన్నెముకను విరిచే చర్యలను చేపడుతున్నారు. ఆ విధానాల ఫలితంగానే రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూతబడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను లిక్విడేట్ చేయడానికి అంటే తెగనమ్మటానికి సిద్ధపడింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన పంచదార ఫ్యాక్టరీలను తెగనమ్మే చర్యలకు వ్యతిరేకంగా చెరకు రైతాంగం తమ హక్కుల సాధన కోసం పోరు బాట పట్టాలి!

- ముప్పాళ్ళ భార్గవశ్రీ,

సిపిఐ ఎంఎల్ నేత, సెల్: 9848120105.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్