ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రామాయపట్నం పోర్టు ప్రభుత్వమే నిర్వహించాలి

1 గంట క్రితం

port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రకాశం జిల్లా రామాయపట్నం దగ్గర ఎ.పి మారిటైం బోర్డు ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం 80 శాతం పూర్తయింది. నిర్మాణం కోసం ఇప్పటికే సుమారు 4 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అకస్మాత్తుగా రామాయపట్నం పోర్టు నిర్వహణను 50 సంవత్సరాలు ప్రైవేట్‌కు లీజుకివ్వాలని 2026 అక్టోబర్‌ 5వ తేదీ నాటికి టెండర్లు ఆహ్వానిస్తూ ఏ.పి మారిటైం బోర్టు ప్రకటన చేసింది.

పోర్టులు దేశానికి ముఖ ద్వారాలు. పోర్టులు ఉన్న ప్రాంతాలు మిగిలిన ప్రాంతాల కంటే బాగా అభివృద్ధి చెందుతాయి. పోర్టు చుట్టూ ఉన్న పరిశ్రమలకు పోర్టు తల్లి లాంటిది. పోర్టు ఆధారంగా అనేక పరిశ్రమలు విస్తరిస్తాయి. పోర్టుతో పాటు ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం ఆయిల్‌ కంపెనీ, ప్రైవేట్‌ భారీ గోడౌన్లు, ప్రతి రోజూ వందలాది భారీ ట్రక్కులు అనివార్యంగా వస్తాయి. 2400 ఎకరాల్లో ఇండోసోల్‌ కంపెనీలో ఇప్పటికే 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాని స్థానికులు 300 మంది కూడా లేరు. అదనంగా 4 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజా పోరాటం వల్ల ఆగింది. రామాయపట్నం పోర్టుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా సరుకుల ఎగుమతి, దిగుమతులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అందుకే మూడు ముఖ్య రైల్వే లైన్లు కూడా రైల్వే శాఖ ఆమోదించింది. సికింద్రాబాద్‌-మార్కాపురం మైన్‌ లైన్‌ 290 కి.మీ, దొనకొండ-ఒంగోలు 119 కి.మీ, గద్వాల్‌-మాచర్ల 184 కి.మీ రైల్వే లైన్లతో రైల్వే రవాణా బాగా పెరుగుతుంది. రామాయపట్నం పోర్టు ఒడ్డున లోతు 15.5 మీటర్లు వున్నందున 2 లక్షల టన్నుల 'పెనమెక్స్‌' షిప్‌లు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే 4 బెర్తుల నిర్మాణం జరగ్గా, వాణిజ్యం పెరిగే కొద్దీ 19 బెర్తులు పెరుగుతాయి. ప్రారంభంలో సాలీనా 34.04 మిలియన్‌ టన్నుల నుంచి 138.54 మిలియన్‌ టన్నులు పెంచుకునే అవకాశాలున్నాయి.

పోర్టును ప్రైవేట్‌కు ఎందుకు అప్పగించాలి?

ఇప్పటికే మొదటి దశ రామాయపట్నం పోర్టు నిర్మాణం 80.55 శాతం పూర్తయింది. మొదటి దశ నిర్మాణానికి పెట్టాల్సిన వ్యయం రూ.4929.39 కోట్లలో 80 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం మరో 20 శాతం పూర్తి చేసి పోర్డును నడపవలసిన సమయంలో పోర్టు అభివృద్ధి, ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ ఎందుకు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు? ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయం చేశారు? పోర్టుల నిర్మాణం కష్టం. నిర్వహణ తేలిక. పోర్టు నిర్మాణానికి సముద్రాన్ని రాళ్ళతో నింపాలి. విశాఖపోర్టు నిర్మాణంలో 12 కొండలు కొట్టి సముద్రాన్ని నింపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి చీమకుర్తి గ్రానైట్‌ను 4 సం‌వత్సరాల పాటు ప్రతిరోజూ వందలాది ట్రక్కులతో లక్షల టన్నుల గ్రానైట్‌తో నింపారు. ప్రభుత్వ భూములతో పాటు అనేక గ్రామాలను ఖాళీ చేయించి పోర్టుకు అప్పగించారు. మత్స్యకారులు, రైతులు, వ్యవసాయ కార్మికుల త్యాగంతో పోర్టు నిర్మాణం పునీతమైంది. అశేష కష్టాలతో నిర్మించిన పోర్టును అప్పనంగా ప్రైవేట్‌కు ఏ స్వలాభంతో అప్పగిస్తున్నారు? 850 ఎకరాల భూమిని ప్రైవేట్‌కు ఎకరాకు సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున లీజుకు ఇస్తున్నారు. రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌కు అప్పగించడంవల్ల ప్రకాశం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. పోర్టు నిర్వహణను ప్రైవేట్‌ యాజమాన్యం లాభాపేక్షతోనే నడుపుతుంది.

ఇప్పటికే పక్కనే నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్టు, విశాఖ జల్లాలోని గంగవరం పోర్టుతో సహా ప్రైవేట్‌ పోర్టులన్నీ అదానీ కంపెనీ పరం అయ్యాయి. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 11 పోర్టులను ప్రైవేట్‌ చేయడానికి వీలు కల్పిస్తూ పోర్టుల చట్టాన్ని సవరించింది. అదానీ ఏది చెబితే కేంద్ర ప్రభుత్వానికి అది వేదం. గుజరాత్‌ లోని ముంద్రా పోర్టుతో సహా అదానీ అడుగు పెట్టిన పోర్టుల్లో స్థానికులకు వినాశనమే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అనుసంధానమైన గంగవరం పోర్టును 2004 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రైవేట్‌కు అప్పగించారు. 2006లో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మత్స్యకారులు, ప్రజలు తుపాకి కాల్పులను కూడా ఎదిరించి పోరాడి స్థానిక మత్స్యకారులు 550 మందికి ఉద్యోగాలు సాధించారు. అదానీ గంగవరం పోర్టును స్వాధీనం చేసుకున్న తర్వాత వీరందరినీ ఉద్యోగాల నుండి తొలగించారు. రామాయపట్నం పోర్టుకు గ్రామాలు ఖాళీ చేసినప్పుడే నిర్వాసితులు, ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఒప్పందం చేయాలి. 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ప్రైవేట్‌ యాజమాన్యం స్థానికులకు, మత్స్యకారులకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇతర రాష్ట్రాల కార్మికులను రప్పించుకొని బానిసల లాగా పని చేయించుకుంటారు. తక్కువ జీతాలు ఇస్తారు. ప్రభుత్వ పోర్టుల పక్కన మత్స్యకారులు జీవించడానికి ఫిష్షింగ్‌ జెట్టీలున్నాయి. వేలాది మంది చేపలు పట్టి దర్జాగా జీవిస్తున్నారు. కాని ప్రైవేట్‌ యాజమాన్యాలు పోర్టుల పక్కన జెట్టీలు లేకుండా చేశారు. రామాయపట్నం పోర్టు భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలలో 18 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వవలసిన నష్టపరిహారం నేటికీ చెల్లించలేదు. పునరావాస కాలనీల్లో మంచినీళ్ళు కూడా అందుబాటులో లేవు. కాలనీల్లోని ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. పట్టించుకునే నాధులే లేరు. ఈ పోర్టు ప్రైవేట్‌ చేతుల్లోకి వెళితే కాలనీల్లోని ప్రజలతో పాటు జిల్లావాసులు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వ ఆధీనంలో వుంటే ప్రకాశం జిల్లా ప్రజలు వలసలు వెళ్ళకుండా జిల్లాలోనే రామాయపట్నం పోర్టులోనే గౌరవప్రదమైన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లా ప్రజలు, స్థానికులు, రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని పోరాడాలి.


- వ్యాసకర్త: సిహెచ్‌. నరసింగరావు

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్