- స్పందించిన వివిఎస్ లక్ష్మణ్
బెంగళూరు : సిఒఇ - టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య అద్భుత సమన్వయం ఉందని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ) హెడ్ వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. టీమ్ ఇండియాలో గాయాల బెడద పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ) పనితీరుపై వస్తున్న విమర్శలకు సంబంధించి వివిఎస్ లక్ష్మణ్ స్పందించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కేవలం ఒక పునరావాస నిర్వహణ కేంద్రంగా మాత్రమే చూడకూడదని, క్రికెటర్లు రాణించడానికి సహాయపడటం కూడా తమ బాధ్యతలో భాగమని పేర్కొన్నారు. ఆదివారం సిఒఇని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సందర్శించిన అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘ఏ క్రీడాకారుడి కెరీర్‌లోనైనా గాయాలు సర్వసాధారణం. ఈ విషయంలో ఏ ఒక్క వ్యక్తిని గానీ, విభాగాన్ని గానీ బలిపశువుగా చూపడం సరికాదు. సిఒఇ, టీమ్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది. ఆటగాడి ఫిట్‌నెస్ స్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు సెలక్షన్ కమిటీకి అందుతాయి. పునరావాస ప్రక్రియలో ఆటగాడి పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే సెలక్షన్ కమిటీ, కోచ్‌లకు సమాచారం అందిస్తాం. బుమ్రా, సాయి సుదర్శన్‌ను ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులోకి తీసుకోవాలని ఉద్దేశంతోనే ఎంపిక చేశారు. ఒకవేళ వారు ఫిట్‌నెస్ పరీక్షలో అర్హత సాధించకపోతే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలో సెలక్టర్లకు ముందే తెలుస్తుంది. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఆటగాడు - జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది’ అని లక్ష్మణ్ వివరించారు.
శ్రీలంకతో టెస్టు సిరీస్ (ఆగస్టు 15) సమయానికల్లా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకుంటారని సెలక్టర్లు వారిని జట్టులోకి ఎంపిక చేశారు. బుమ్రా మోకాలిలో నీరు చేరడంతో అతడికి నయమవడానికి ఇంకాస్త సమయం పడుతుందని టెస్టు సిరీస్ నుంచి తప్పించారు. సుదర్శన్ కాలి వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడూ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)