ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమిత్‌ ‌షా సమాధానం చెప్పకతప్పదు

1 గంట క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 08:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోలీసుల దాడులపై రాహుల్‌

న్యూఢిల్లీ : నీట్‌ పేపర్‌ లీకేజీ, అక్రమాలకు వ్యతిరేకంగా జంతర్‌‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు సాగించిన అమానవీయ దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా సమాధానం చెప్పి తీరాల్సిందేనని, ఏదో ఒక రోజు ఆయన సమాధానం చెప్పక తప్పదని లోక్‌‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. విద్యార్థులపై తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి సమాధానం చెప్పాల్సివుండగా...బదులుగా విద్యార్థులనే క్షమిస్తున్నానని ప్రకటించడం హాస్యాస్పదమని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శనివారం జరిగిన 'ఛాత్రోంకీ గూంజ్​' (విద్యార్థుల గళం) కార్యక్రమంలో ఓ విద్యార్థి తనతో పంచుకున్న ఆవేదనను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదివారం పంచుకున్నారు. ఉన్న భూమి అమ్మి, అదీ చాలక అప్పులు చేసి మరీ పరీక్షకు సిద్ధమైతే చివరికి దక్కిందేమీ లేదని బాధిత విద్యార్థి వాపోయినట్లు రాహుల్​ చెప్పారు. ఇప్పుడు తనకు ఏదారీ కనిపించటం లేదని అతడు తనతో చెప్పినట్లు తెలిపారు. ఇది ఆ విద్యార్థి వైఫల్యం కాదని, అతని కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వలేని ప్రస్తుత వ్యవస్థ వైఫల్యమని ఆయన విమర్శించారు. యువతే దేశానికి వెలుగు అని, వారికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశపు గొప్ప బలం యువతేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, యువ భారతీయులకు తమ గళాలను, ఆందోళనలను వినిపించడానికి, తమ హక్కులు, కలలు, ఆకాంక్షల కోసం పోరాడటానికి ఒక వేదికను అందించడంలో ఐవైసి ఎంతో ప్రాముఖ్యమైననది తెలిపారు.

ఆదివాసీలే అసలైన యజమానులు..

ఆదివాసీలే దేశపు అసలైన యజమానులని, వారి విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి లభించిన అమూల్యమైన వారసత్వ సంపదగా రాహుల్‌ కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. భూమి, అటవీ సంపదపై వారికి ఉన్న హక్కులతో పాటు, వారి అస్తిత్వం ఆత్మగౌరవం కోసం సాగే పోరాటంలో వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్