ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రౌడీ షీటర్‌‌పై పీడీ యాక్టు

1 గంట క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కడప సెంట్రల్ జైలుకు తరలింపు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పదేపదే నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కల్గిస్తున్న షేక్ ముజాహిద్ అలియాస్‌ ముజ్జు పై ‌పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డిఎస్‌‌పి శివ నారాయణస్వామి తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని గాంధీనగర్‌‌లో నివాసముంటూ ముజ్జు పలు నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో నిందితుడిపై పలు తీవ్రమైన నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేశామన్నారు. హత్యాయత్నం, గాయపరచడం, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలకు ముజ్జుపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అరెస్టు, రిమాండ్, బెయిల్, కౌన్సెలింగ్ వంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ నిందితుడు తన నేరకార్యకలాపాలను కొనసాగిస్తున్నాడని, దీంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడి, ప్రజాశాంతికి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. పునరావృత నేరప్రవృత్తి నేపథ్యంలో పీడీ యాక్టు కింద చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986లోని సెక్షన్ 2 ప్రకారం గూండాగా పరిగణించామన్నారు. జిల్లా పోలీసు శాఖ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని నిర్బంధించడానికి కడప సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. నేర వృత్తికి అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్‌‌పి హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్