హెచ్‌సిఎ క్రికెట్ హెడ్ అంబటి రాయుడు
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు వద్ద ఏర్పాటు చేసిన వెల్చాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్‌లో సౌకర్యాలు బాగున్నాయని, టీజీ20 లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం అందించగల స్థాయిలో గ్రౌండ్‌ను అభివృద్ది చేశారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) క్రికెట్ హెడ్ అంబటి రాయుడు అన్నాడు. జిల్లాల క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ది కమిటీ చైర్మన్ శేషు నారాయణ్, మహిళల క్రికెట్ డైరెక్టర్ సునిత ఆనంద్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. ఆగమ్ రావులు ఆదివారం విజెఆర్ క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించారు. ఇప్పటికే ఇక్కడ టర్ఫ్ వికెట్లు, నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు, హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయగా.. హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీని ఇక్కడ నెలకొల్పాలని ఇటీవల ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌ను పరిశీలించిన రాయుడు సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు ఇక్కడ రెగ్యులర్‌గా లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ సాధన చేస్తున్న జూనియర్ క్రికెటర్లు, ఓపెన్ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న మహిళా క్రికెటర్లతో రాయుడు మాట్లాడాడు. ఈ సందర్భంగా అంబటి రాయుడు, సునీత ఆనంద్, శేషు నారాయణ్‌లను కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది.








కామెంట్‌లు (0)