- నేరుగా సుప్రీంకు ఎందుకొచ్చారని ప్రశ్న
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత వుందో తప్పనిసరిగా వెల్లడించాలని కోరుతున్న, అదే సమయంలో ఇ20 పెట్రోల్‌ను అమలు చేయడంలో ‘నిశ్శబ్దమైన బలవంతం’ ఇమిడి వుందని ఆరోపిస్తున్న ఆ పిటిషన్‌ను సుప్రీం సోమవారం కొట్టేసింది.
న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి స్వయంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలెలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఇంధనం నాణ్యత, ప్రమాణాలు, కూర్పు, అనుకూలత వంటి అంశాలను తెలుసుకునే హక్కు వుందని పిటిషన్ పేర్కొంది. అయితే ఆ సమాచారం వెల్లడించడమనేది వినియోగదారుడు పైపైన చేసే నినాదంగా వుండరాదని, దానికి ఒక రాజ్యాంగపరమైన ఆవశ్యకతను రూపొందించాలని ఆ పిటిషన్ కోరింది. దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా ఆ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం తిరస్కరించింది. ముందుగా పిటిషనర్ తన ఇబ్బందిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్ళాల్సి వుందని, అలాకాకుండా నేరుగా సుప్రీంను ఆశ్రయించారని బెంచ్ పేర్కొంది. అందువల్ల ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించింది. సంబంధిత అధికార యంత్రాంగం వద్దకు పిటిషనర్ వెళ్లవచ్చని సూచించింది. ఈ మేరకు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు వద్దకు వెళ్ళకుండా నేరుగా సుప్రీంకు ఎందుకొచ్చారు? అసలు మీరు ఎవర? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ముందుగా హైకోర్టుకు వెళ్ళండి, ఫైల్ చేయండి.’’ అని బెంచ్ పిటిషనర్ గోస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దానిపై గోస్వామి స్పందిస్తూ ‘వినియోగదారులు ఏమి కొంటున్నారో దాని గురించి తెలుసుకునే హక్కు వారికుంటుంది.’ అని చెప్పారు.







కామెంట్‌లు (0)