న్యూఢిల్లీ: భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రెడ్-బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలన్న తన చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం లేదని భావించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాహల్ వెల్లడించాడు. అయితే వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తన ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశాడు.
2009లో హర్యానా తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన చాహల్.. 49 మ్యాచ్‌ల్లో 148 వికెట్లు పడగొట్టాడు. 32.27 వికెట్ సగటును నమోదు చేశాడు. 2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అతను.. ఏడు మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీశాడు. లార్డ్స్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడిన మ్యాచ్‌నే చాహల్ చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌గా నిలిచింది.
తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ చాహల్ భావోద్వేగపూరితంగా స్పందించాడు. "నేను పట్టుకున్న మొదటి క్రికెట్ బంతి రెడ్-బాల్. నాకు 10 ఏళ్ల వయసులో మొదలైన ఈ ప్రయాణంలో రెడ్-బాల్ క్రికెట్ నుంచే సహనం, పట్టుదల, పోరాట స్ఫూర్తిని నేర్చుకున్నాను. టెస్ట్ క్యాప్ గెలవడం ఎప్పుడూ నా కల. అది నెరవేరకపోయినా, ఇప్పటి వరకు సాగిన నా ప్రయాణంతో సంతృప్తిగా ఉన్నాను. రెడ్-బాల్ క్రికెట్ నాకు అందించిన అందమైన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను" అని పేర్కొన్నాడు.
అయితే తన క్రికెట్ ప్రయాణం ఇంకా ముగియలేదని చాహల్ స్పష్టం చేశాడు. "నా దేశం కోసం ఆడాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని నేను నమ్ముతున్నాను. వన్డే, టీ20 ఫార్మాట్లలో మరో అవకాశం కోసం నా సర్వస్వం ఇస్తాను. నా ప్రయాణం ఇంకా ముగియలేదు" అని చెప్పాడు.
2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడిన చాహల్.. 16.14 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 20కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతని బౌలింగ్ సగటు రెండో అత్యుత్తమంగా నిలిచింది.
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చాహల్ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన అతను.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. 2023/24 విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా టైటిల్ విజయంలోనూ చాహల్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 14.83 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు.







కామెంట్‌లు (0)