శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆంధ్రప్రదేశ్‌పై సుప్రీంకోర్టుకు ఒడిశా ప్రభుత్వం

50 నిమిషాల క్రితం

Odisha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 11:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

భువనేశ్వర్‌ : రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని వివాదాస్పద కోటియా ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ, ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒడిశాలోని కోటియాలో జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఈ నోటిఫికేషన్‌పై కోరాపుట్ జిల్లా కలెక్టర్ ద్వారా పిటిషన్‌ను దాఖలు చేసినట్లు ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి శనివారం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అనుమతితో పిటిషన్‌ దాఖలు చేశామని అన్నారు. 2006 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, రెండు రాష్ట్రాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కోటియా గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 28 గ్రామాలు ఒడిశాలోనే ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ వీటిలో 21 గ్రామాలపై తమ హక్కులను క్లెయిమ్ చేస్తోంది. వాటిని సవాలు చేస్తూ ఒడిశా 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2006లో కోర్టు రెండు రాష్ట్రాలను యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని సురేష్‌ పూజారి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ధిక్కార చర్యలు ప్రారంభించామని, ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రధాన కార్యదర్శి, సంబంధిత జిల్లా కలెక్టర్, ఎన్నికల నిర్వహణలో ఉన్న ఇతర అధికారులను ప్రతివాదులుగా చేర్చామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా తాము సుప్రీంకోర్టును కోరనున్నామని అన్నారు. 2021లో కూడా, వివాదాస్పద ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ఒడిశా 2022లో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. వివాదాస్పద గ్రామాలైన ఫగునసినేరి, గంజేయిపదార్, ఫతుసినేరిలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసిందని ఒక అధికారి తెలిపారు. కోటియా ఒడిశాలో అంతర్భాగమని, తమ హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని సురేష్‌ పూజారి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్