శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఒప్పందం రుద్దుతున్నారు

1 గంట క్రితం

mark.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 05:54 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​దేశీయ సరుకులతో మార్కెట్లను నింపాలని మహాకవి గురజాడ ఏనాడో హితవు చెప్పారు. కానీ స్వేచ్ఛా మార్కెట్ల కోసం ఎగబడుతూ ‘‘ఆత్మనిర్భర భారత్’’ పేరిట విదేశీ సరుకులకు తలుపులు బార్లా తెరిస్తే, ఆర్థిక వ్యవస్థ డొల్లైపోతున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన దౌత్య మర్యాదలనే కాదు, దేశ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది. ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ముంబైలో విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చలు జరిపి, అక్కడి నుంచి గుజరాత్‌లోని అంబానీల రిలయన్స్ జామ్‌నగర్ చమురు శుద్ధి కర్మాగారానికి వెళ్లారు. భారత కార్పోరేట్‌ ‌బిగ్‌బాస్‌‌లకు ‌ తాము అడ్డంకి కాదనీ, పరస్పర ప్రయోజనాలతో లాభాలు పంచుకోవచ్చనీ చెప్పే సంకేతం ఇందులో దాగి ఉందని కొందరి నిపుణుల మాట.

అమెరికా మధ్యంతర ఎన్నికల ముందు ఇంధన ధరలు ట్రంప్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. వెనిజులా చమురును ప్రపంచ మార్కెట్లో అమ్మిపెట్టడంలో, అమెరికాలో కొత్త శుద్ధి కర్మాగారం నిర్మించడంలో రిలయన్స్ వాషింగ్టన్ వ్యూహంలో కీలక భాగస్వామి. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరగాల్సిన బేరసారాలు ఒక కార్పొరేట్ సంస్థ ఆతిథ్యంలో, ఆ సంస్థ యజమానుల సమక్షంలో జరగటం మన దేశానికి హానికరం. ఇంధన కొనుగోళ్ల నుంచి వ్యవసాయ దిగుమతుల వరకు నిర్ణయాలు ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయో దీన్ని బట్టి విదితమవుతోంది. వాణిజ్య ఒప్పందంపై రూబియో 99శాతం పని పూర్తయిందన్నారు. కానీ ఒప్పందంలోని అంశాలు పార్లమెంటు ముందుకు రాలేదు. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల రద్దు రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని, ఒప్పంద వివరాలను బయటపెట్టకుండా ఇంత గోప్యత ఎందుకని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పర్యటన ఎజెండా ఇంధనం, వాణిజ్యం,పెట్టుబడులు,రక్షణ,ఆధునిక సాంకేతికతేనని అధికారికంగా చెబుతున్నారు. కానీ ఒప్పందానికి ఆటంకాలు రాకుండా భారత బడా పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరచడమే అసలు లోగుట్టు.

రూబియో ముంబైలో దిగిన సమయంలోనే, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి లైంగిక నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌‌స్టీన్‌‌తో కలిసి ఉన్న ఫొటోలు అమెరికా న్యాయశాఖ తాజాగా ఫైళ్ల నుంచి వెలుగులోకి తెచ్చారు. ఒకవైపు రూబియో పర్యటన, మరోవైపు పూరి ఫొటోల విడుదల. ఇదంతా ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచడానికి అమెరికా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నదా అన్న సందేహం కలగక మానదు. అయితే మోడీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడం తనకు ఇష్టం లేదని గత ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ వ్యాఖ్యానించడం గుర్తు చేసుకోవడం అవసరం. ఒక ప్రతినిధి బృందంలో భాగంగానే ఎప్‌‌స్టీన్‌‌ను కలిశానని, తనకేపాపం తెలియదని పూరి చెప్పుకుతిరిగారు. కానీ ఆయన ఎప్‌‌స్టీన్‌‌తో ఏకాంతంగా ఉన్న ఫొటో బయటకు రావడంతో ఇప్పుడు ఖంగుతినాల్సిన పరిస్థితి. పూరి, బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ ఆరోపణలపై పూరి ఇంకా స్పందించలేదు.

​భారత రైతు ఇప్పటికే పెరుగుతున్న విత్తన ధరలు, ఎరువులు, విద్యుత్, రవాణా ఖర్చులతో సతమతమవుతున్నాడు. యాపిల్ సాగుదారులు, పత్తి, సోయా రైతులు, పాడి, పౌల్ట్రీ రంగం, చిన్న రైతులు, వారి ఉత్పత్తి ధరలు, మార్కెట్ రక్షణ, దిగుమతి పోటీ వంటివి అమెరికా ఒప్పందంతో కుదేలవుతాయి. భారీ సబ్సిడీలు పొందే విదేశీ వ్యవసాయ ఉత్పత్తులతో పోటీకి దేశీయ రైతులను నిలబెట్టి మార్కెట్లను తెరిస్తే, మూల్యం చెల్లించేది గ్రామీణ భారతమే. రైతు ఆదాయం, కనీస మద్దతు ధర, పంటల కొనుగోలు, ఆహార భద్రతకు పరిష్కారం చూపకుండా రైతును బలి చేయడం అన్యాయం. అలాగే, కార్మికుల ప్రయోజనాలూ అంతే కీలకం. అమెరికా కార్మిక శాఖ ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ సహా ఎనిమిది సంస్థలను గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో కీలకమైన కార్మిక ధ్రువీకరణ పథకం నుంచి సస్పెండ్ చేయడం, ట్రంప్ అధికార పీఠమెక్కిన నాటి నుండి 3లక్షల వీసాలు రద్దు చేయడం భారతీయ ఐటి ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా రష్యా చమురు భారత్ వంటి ఇతర దేశాలు కొంటే సుంకాలు తప్పవని బెదిరించి, తానే రష్యాతో ఒప్పందం చేసుకొని ఇది వ్యాపారం అంటూ ట్రంప్‌ ‌దీర్ఘాలు తీశారు. దీనిపై కాషాయ పెద్దలు స్పందించడం లేదు.

​భారత అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతులకు, వ్యవసాయ రంగానికీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ భారతం ఆత్మహత్యలు, ఆకలి చావులతో మరింత దిగజారిపోతుందని ఎస్‌‌కెఎం, రైతు, వ్వవసాయ కార్మిక సంఘాలు ఘోష పెడుతున్నాయి. పాడి రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. మరోవైపు అమెరికన్‌ ‌పారిశ్రామిక ఉత్పత్తులు వరదగా రావడం వల్ల భారతీయ ఉత్పత్తులకు మార్కెట్‌ ‌కరువవుతుంది. ఫలితంగా పారిశ్రామిక రంగంలోనూ సంక్షోభం తీవ్రం అవుతుంది. ఇంతలా నష్టపరిచే ఒప్పందం కోసం బిజెపి సర్కార్ తహతహలాడడం దారుణం. భారతదేశాన్ని అమెరికాకు జూనియర్‌ ‌భాగస్వామిగా చేస్తున్న బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విధానాన్ని, నష్టదాయకమైన వాణిజ్య ఒప్పందాన్ని భారత ప్రజలు ప్రతిఘటించాలి.. తిప్పిగొట్టాలి. అందుకు విశాల ప్రజా ఉద్యమాలు సాగాల్సిందే!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్