ప్రజాశక్తి - తుళ్లూరు : 2028 ఆగస్టు నాటికి రాజధాని అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి పర్యటించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసిపి నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన ప్రతి రైతుకు ప్లాట్లు ఇచ్చామన్నారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి ఏమి కనిపిస్తుందని, బయటకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పే 'మావిగన్' ఎక్కడ ఉందని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజన్ ఉంటే జగన్ కి ఏమీ లేదన్నారు. టెండర్ ల ప్రకారం అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంతవరకు తీసుకోలేదని స్పష్టం చేశారు. వర్షాకాలం రానున్న దృష్ట్యా కొండవీటి వాగు, పాలవాగు పనులు పరిశీలించడం జరిగిందని చెప్పారు. వర్షా కాలంలో రాజధాని నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 69 బ్రిడ్జ్ ల దగ్గర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రానున్న నాలుగు నెలలు వర్షాలు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటునట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ డి లక్ష్మీ పార్థసారధి, సి ఆర్ డి ఎ అధికారులు ఉన్నారు.
2028 నాటికి 'అమరావతి' మొదటి దశ నిర్మాణం పూర్తి
03 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)