శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటల బీమా పెద్ద ఫార్స్‌

2 గంటల క్రితం

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఉచితం లేక భారం తట్టుకోలేక రైతులు దూరం

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఆదా

- కంపెనీల లాభం రూ.1605 కోట్లు.. కర్షకులకందిన పరిహారం రూ.165 కోట్లు

- విపత్తు రైతులకు భారీ నష్టం

ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి : తుపాన్లు, వరదలు, కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతిని భారీగా ఆర్థిక నష్టాలకు గురైన రైతులకు కాస్తంత ఆసరా కావాల్సిన పంటల బీమా పెద్ద ఫార్స్‌‌గా తయారైంది. టిడిపి కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో పాటు కేంద్రం ఆదేశాలతో ఇన్సూరెన్స్‌ను ఐచ్ఛికం (రైతుల స్వచ్ఛంధం) చేయడంతో ఈ రెండేళ్లల్లో బీమా చేయించుకుంటున్న రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. రైతులు ప్రీమియం చెల్లించిన వరకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించట్లేదు. చివరాఖరికి పరిహారం పొందుతున్న రైతులు, వారికి అందుతున్న సొమ్ము ఇంకా ఇంకా తగ్గిపోతోంది. మొత్తమ్మీద కంపెనీలకే ఆయాచిత లాభం. ఇంకోవైపు ప్రీమియం చెల్లించలేక బీమా చేయించుకునే రైతులు తగ్గిపోతుండటంతో ఆ మేరకు తమ వాటా ప్రీమియం తగ్గిపోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా నిధులు ఆదా అవుతు న్నాయి. తమకు బీమా కనీస భరోసా ఇవ్వట్లేదని విపత్తు బాధిత రైతులు గగ్గోలు పెడుతుండగా, కూటమి ప్రభుత్వం పాత నిబంధనలతోనే 2026-27 ఖరీఫ్‌, రబీలలో ఫసల్‌ (దిగుబడి ఆధారితం), పునర్వ్యస్థీకరించిన వాతావరణ బీమా పథకాలను కంపెనీలకు అప్పగించింది. రెండేళ్లలో రైతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాదాపు రూ.1,770 కోట్లు కంపెనీలకు ప్రీమియం చెల్లించగా, ఇప్పటి వరకు రైతులకు అందిన పరిహారం రూ.165 కోట్లు మాత్రమే. కంపెనీలకు సుమారు 1,605 కోట్లు లాభం. ఇంతటి లాభసాటి వ్యాపారం మరేదీ ఉండదేమో!

అంతకంతకూ...

వైసిపి హయాంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలతో నిమిత్తం లేకుండా రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా (ఉచిత) రాష్ట్ర ప్రభుత్వమే బీమా పథకాలను నిర్వహించినంతకాలం కొద్ది మేరకైనా రైతులకు త్వరత్వరగా పరిహారం అందింది. ఎప్పుడైతే కేంద్ర పథకాలలో చేరిందో అప్పటి నుంచి పంటల బీమా రైతులకు దూరమవుతూ వచ్చింది. వైసిపి పాలనలో పంటల బీమా ఘోరంగా ఉందని విమర్శిస్తూ, తామొస్తే సమగ్ర పంటల బీమా తెస్తామన్న కూటమి ప్రభుత్వం.. వైసిపి దారిలో కేంద్ర పథకాల్లో చేరేందుకు సై అంది. అప్పటి వరకు అమలైన ఉచిత బీమాను ఎత్తేసి రైతుల వాటా ప్రీమియాన్ని వారినే చెల్లించుకోమంది. మరో వైపు కేంద్రం బీమాను ఐచ్ఛికం అంటూ రైతుల ఇష్టా ఇష్టాలకు వదిలేసింది. 2024-26 రెండేళ్లకు ఒకేసారి బీమా అమలును కంపెనీలకు అప్పగిం చగా, 2024 ఖరీఫ్‌ ‌మట్టుకు ఉచిత బీమాను అమలు చేసి, ఆ ఏడాది రబీ నుంచి ఉచితం ఎత్తేసింది. ఉచిత పంటల బీమా అమలు చేసిన 2024 ఖరీఫ్‌‌లో ఫసల్‌ ‌బీమాకు 24 లక్షల మంది రైతులు పంటలను బీమా చేయించుకోగా తదుపరి ఏడాది 2025 ఖరీఫ్‌‌లో 4.52 లక్షలకు తగ్గారు. వాతావరణ బీమా చేయించు కున్న రైతులు 8 లక్షల నుంచి 15 వేలకు తగ్గిపోయారు.

ప్రభుత్వాలు ఎగనామం

సకాలంలో తమ వాటా ప్రీమియాన్ని చెల్లించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎగవేతకు పాల్పడుతున్నాయి. ప్రీమియంలో ఖరీఫ్‌‌లో అయితే రైతులు 2 శాతం, రబీలో 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం వంతున కంపెనీలకు చెల్తిస్తే తతిమ్మా మొత్తాన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం, సగం జమ చేయాలి. కానీ 2024 ఖరీఫ్‌‌లో ఫసల్‌ ‌బీమాకు కేంద్ర ప్రభుత్వం అల్లూరి, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, కోనసీమ, తూర్పుగోదావరి, కర్నూలు, ఎన్‌‌టిఆర్‌, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప... 17 జిల్లాలకు తన వాటా ప్రీమియం చెల్లించలేదు. 2024 ఖరీఫ్‌‌లో వాతావరణ బీమాకు కోనసీమ, తూర్పుగోదావరిలో ప్రీమియం చెల్లింపులు సున్నాగా నమోదైంది. బాపట్ల జిల్లాకు కేంద్రం తన వాటా చెల్లించలేదు. 2024 రబీలో ఫసల్‌కు ప్రీమియం చెల్లింపులు సున్నా, వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపులు సున్నా. 2025 ఖరీఫ్‌‌లో ఫసల్‌ ‌బీమా ప్రకాశం, మన్యం, నంద్యాల, కృష్ణా, గుంటూరు, కాకినాడ, ఏలూరు, బాపట్లలో ఎంతోకొంత ప్రీమియం చెల్లింపులు జరిగ్గా, తతిమ్మా 18 జిల్లాల్లో సున్నా. 2025 ఖరీఫ్‌‌లో వాతావరణ బీమా బాపట్లలో సున్నా ప్రీమియం నమోదైంది. 2025 రబీలో ఫసల్‌, వాతావరణ బీమా రెండూ అసలు కేంద్రం వద్ద నమోదు కాలేదు.

క్లెయిములు తీసికట్టు

క్లెయిముల పరిష్కారం, పరిహారం చెల్లింపుల పరిస్థితి నానాటికీ తీసికట్టు చందంగా తయారైంది. 2024 ఖరీఫ్‌‌లో ఫసల్‌ ‌బీమాలో అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, శ్రీసత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరిలో చెల్లింపులు సున్నా. మిగతా జిల్లాల్లో పదోపరకో ఇచ్చారు. 2024 ఖరీఫ్‌‌లో వాతావరణ బీమా కింద అన్ని జిల్లాలకూ కలిపి రూ.144 కోట్లిచ్చారు. ఇదే కొంత వరకు మెరుగు. అప్పుడు ఉచిత బీమా అమలైంది. 2024 రబీలో ఫసల్‌, వాతావరణ రెండింటికీ పరిహారం సున్నా. 2025 ఖరీఫ్‌‌లో ఫసల్‌ ‌బీమా కింద ఒక్క కోనసీమకు రూ.99 లక్షల పరిహారం అందింది. అదే ఏడాది ఖరీఫ్‌‌లో వాతావరణ బీమా పరిహారం సున్నా.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్