కృత్రిమ మేధ (ఎ.ఐ) కాలంలో, రిటైర్డ్ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే చెప్పిన ఒక్క మాట అందరినీ ఆలోచింపజేస్తుంది. ‘ఎన్ని ఎ.ఐ లు వచ్చినా, ఆరుగాలం కష్టించే రైతన్న లేకపోతే కడుపు నిండదు’. బెంగళూరు సమీపంలో ‘బిడది టౌన్‌షిప్’ కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న తీరును ఆయన ప్రశ్నించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో భూముల కేటాయింపు, వాటి వినియోగం ఒక సంక్లిష్టమైన సమస్యగా మారిపోయింది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరిశ్రమలకు కేటాయించిన భూములు కార్పొరేట్ ల్యాండ్ బ్యాంకుగా మారాయే తప్ప పరిశ్రమలు రావడం లేదు. ఈ నేపథ్యంలో, బ్రాహ్మణి స్టీల్స్ భూములు స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వం నిర్ణయం సరైనదే అయినప్పటికీ, ఆ భూములను తిరిగి సంబంధిత రైతులకు అప్పగించడం ద్వారానే నిజమైన న్యాయం జరుగుతుంది. అప్పటి పాలకులు బ్రాహ్మణి స్టీల్స్ కు వైఎస్సార్ కడప జిల్లాలోని అంబవరం పరిధిలో 14 వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. 10 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి, వేల మంది యువతకు ఉపాధి అంటూ హడావిడి చేశారు. అయితే, 18 ఏళ్లు గడిచినా అక్కడ నిర్మించింది కేవలం ప్రహరీ గోడ, ఓ చిన్న షెడ్డు మాత్రమే. అంతలోనే ఆ సంస్థ ప్రభుత్వం ఇచ్చిన భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వందల కోట్ల రుణాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ భూముల విలువ సుమారు రూ. 5 వేల కోట్లు అని అంచనా. ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పారదర్శకతను పెంపొందించడానికి భూముల స్వాధీనం సానుకూల చర్య. అయితే, అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించినప్పుడు, ఆ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చకపోతే, వాటిని రైతులకు తిరిగి ఇవ్వడం సరైనది. అలాగే, బ్రాహ్మణి స్టీల్స్ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరిశ్రమలకు కేటాయించినప్పటికీ నిరుపయోగంగా ఉన్న భూములు వేలాది ఎకరాల్లో ఉన్నాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎ.పి.ఐ.ఐ.సి) ద్వారా లక్షల ఏకరాల భూములను కేటాయించారు. అయితే, ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడం వల్ల అవి నిరుపయోగమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతో పాటు, ఆ భూముల విలువ పెరిగినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతుంది. ఉపాధి అవకాశాలు ఆశించిన యువతకు నిరాశే మిగిలింది. వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులకు, పారిశ్రామికాభివృద్ధి లేకపోవడంతో అటు భూమి, ఇటు ఉపాధి లేకుండా పోయింది. అయితే ఇటీవలే పరిశ్రమల మంత్రి గత 15 నెలల్లో 10 వేల ఎకరాలకు పైగా భూమిని పరిశ్రమలకు కేటాయించామని, గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే కేటాయించిందని తమ ఘనతను చెప్పుకొచ్చారు. అయితే, ఎంత భారీగా భూముల కేటాయింపు జరిగిందనే కంటే, ఆ భూముల్లో వాస్తవంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమందికి ఉపాధి లభించింది? అనేదే ముఖ్యం. అయితే పచ్చని పంట భూములను ఇష్టానుసారం పంచేస్తామంటే ఆంధ్రావని ఒప్పదు. పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి అవసరం. కానీ, అది స్థానిక ప్రజల, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను విస్మరించరాదు. ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను రూపొందించేటప్పుడే ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. భూముల కేటాయింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకత చూపాలి. కేటాయించిన భూముల్లో పరిశ్రమలు నిర్మించకపోతే, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం అందించడమే కాకుండా, ప్రాజెక్టులు రద్దయినప్పుడు భూములను తిరిగి వారికి అప్పగించే విధానాన్ని రూపొందించాలి. ఆర్ అండ్ ఆర్ చట్టం(2013)లో ఈ అంశం కూడా ఉంది. కాని పాలకులు దాని అమలును విస్మరిస్తున్నారు. కేవలం భూముల కేటాయింపుతో చేతులు దులుపుకోకండా, వాస్తవంగా పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించే సంస్థలను ప్రోత్సహించాలి. దీనికోసం నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములన్నింటినీ సమీక్షించి, వాటిని సద్వినియోగం చేయడానికి లేదా రైతులకు తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అలా కాకుండా, అభివృద్ధి పేరుతో రైతు హక్కులను ఉల్లంఘించి, వ్యవసాయం లేకుండా అభివృద్ధి చేస్తామంటే అది సాధ్యం కాదు. భూములను నిరుపయోగంగా మిగిల్చితే అది రైతన్నలకే గాక రాష్ట్రానికీ తీవ్ర నష్టం. ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది. కాబట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయని లేదా పాక్షికంగా ఏర్పాటైన లేపాక్షి, కాకినాడ సెజ్‌లు, వాన్‌పిక్, నిమ్జ్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల భూముల్ని సంబంధిత రైతులకు తిరిగివ్వడం న్యాయమైంది. సర్కారు, ఆ దిశగా యోచించాలి. అందుకు ఏలినవారు తలొగ్గేలా సమైక్య రైతు ఉధ్యమాలు సాగాలి.







కామెంట్‌లు (0)