- ఐద్వా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్ బోస్
- షరతులూ లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి
- బిజెపి తీరుతో మహిళలకు అన్యాయం
ప్రజాశక్తి - విజయవాడ: 33 శాతం రిజర్వేషన్ మహిళల హక్కని, ఎలాంటి షరతులూ లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఐద్వా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్ బోస్ డిమాండ్ చేశారు. ఐద్వా జాతీయ సమావేశాలు 10, 11, 12 తేదీల్లో మూడురోజులపాటు విజయవాడలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఐద్వా సిఈసి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, మొదటి సమావేశం ఢిల్లీలో జరిగిందని, రెండో సమావేశం విజయవాడలో జరుగుతోందని తెలిపారు. దేశంలో నెలకొన్న సంక్షోభానికి వ్యతిరేకంగా, ఎస్‌ఐఆర్ వంటి అంశాలపై కూడా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలతోపాటు, గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించిన అంశం కూడా చర్చకు వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనినిక బోస్ ఘోష్ మాట్లాడుతూ ప్రస్తుత సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించామని పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉందని అన్నారు. రిజర్వేషన్ అమలు కోసం నెలరోజులుగా పార్లమెంటు ఎదుట ధర్నా చేస్తూ మహిళల గొంతు వినిపిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్రం డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం ద్వారా రిజర్వేషన్ బిల్లును ఆపేయాలనే ఆలోచనతో కేంద్ర కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న పురుషాధిక్య భావజాలంతో అనేక రాజకీయ పార్టీలు మహిళలకు హక్కులు కల్పించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. అయితే మహిళలకు హక్కు కల్పించాలి, అది న్యాయం అనే నినాదాన్ని సిపిఎంతోపాటు కొద్ది రాజకీయ పార్టీలు మాత్రమే బలంగా ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు. చట్టప్రకారం మహిళలకు దక్కాల్సిన న్యాయం అందడం లేదని, అంటే హక్కును నిరాకరించడమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు, శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మహిళల సమస్యలు, మహిళా రిజర్వేషన్, మహిళా వ్యతిరేక మౌలికవాద ధోరణులు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నామని అన్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
అమెరికా ఆంక్షలతో క్యూబా అవస్థలు
అమెరికా విధిస్తున్న ఆంక్షలతో క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఒకప్పుడు ఆరోగ్య రంగంలో క్యూబా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఆంక్షల ఫలితంగా మందులు అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు లేకపోవడం, ఆధునిక వైద్య పరికరాలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. దీనివల్ల శిశు మరణాలు, గర్భిణులు బాలింతల మరణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల వల్ల క్యూబాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని వివరించారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, దిగుమతులు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలు క్యూబా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. క్యూబా ప్రజలకు ఐద్వా తరుపున హృదయపూర్వక సంఘీభావాన్ని తెలిపారు. ఐద్వా జాతీయ అధ్యక్షులు పి.కె.శ్రీమతి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ లొంగిపోయారని అన్నారు. పాలస్తీనాలో జరుగుతున్న మారణహోమం, ఇరాన్ అమెరికా యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ తదితర అంశాలపైనా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై వీటి ప్రభావం పడుతోందని అన్నారు. ట్రంప్‌ను ప్రశ్నించడంలోనూ మన దేశ ప్రయోజనాలను బలంగా వినిపించడంలోనూ ప్రధాని ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు. యుద్ధ ప్రభావం వల్లే పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన సామాన్యులపై పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవనోపాధిపై తీవ్ర దాడులు జరుగుతున్నాయని అన్నారు. అమెరికాలోనూ ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతున్నారని, వైద్య రంగానికి బడ్జెట్ కోతలు విధించడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తగ్గించడంపై అక్కడ ప్రజల్లో నిరసనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో చైనా ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. క్యూబా ప్రజలు కూడా నిరంతరం పోరాడుతున్నారని, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న దిగ్బంధనం, ఆంక్షల మధ్య క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్నారు. అమెరికా తీరు సామ్రాజ్యవాద సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. మనదేశంలోనూ వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం పోరాడుతున్న ప్రపంచ ప్రజలకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీదేవి మాట్లాడుతూ సెప్టెంబర్ 12వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు మహిళల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.
ఐద్వా రాష్ట్ర కమిటీకి అభినందనలు
ఎపిలోని ఐద్వా నిర్వహిస్తున్న పోరాటం అభినందనీయమని, ప్రతి సమస్యను, ప్రతి అంశాన్ని మహిళల సమస్యగా మాత్రమే కాకుండా మొత్తం సమాజ సమస్యగా తీసుకుని పోరాడుతోందని శ్రీమతి, కనినికబోస్ ఘోష్ అన్నారు. దళితులు, ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)