న్యూఢిల్లీ : నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన 34 మంది ఎపి వాసులను గుర్తించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో ఏడుగురు గల్లంతయ్యారని, వారి కోసం సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. తిరుపతి నుండి వెళ్లిన 28మంది ప్రస్తుతం ఖాట్మాండులో సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
ఎపి ప్రభుత్వం ఢిల్లీలోని ఎపి భవన్‌లో అత్యవసర కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని, కేంద్రప్రభుత్వం, ట్రావెల్ సంస్థలు, నేపాల్ ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఆర్‌టిజిఎస్ కేంద్రం పనిచేస్తోందని అన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ-కర్నూలుకి చెందిన నలుగురు యాత్రికులు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని, వారితో మాట్లాడామని అన్నారు. తిరుపతి నుండి వెళ్లిన మరో 28మంది యాత్రికుల బృందం కూడా ఖాట్మాండులో సురక్షితంగా ఉందని చెప్పారు. చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు జిల్లాల నుండి వెళ్లిన ఏడుగురు వ్యక్తుల సమాచారం తెలియలేదని అన్నారు. గల్లంతైనవారిలో ముగ్గురు ఈశా ఫౌండేషన్‌కి చెందిన కైలాస మానససరోవర యాత్రికుల బృందానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఆ బృందంలోని ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ఇంకా వారిని సంప్రదించాల్సి ఉందని, ప్రస్తుతం వారి మొబైల్ ఫోన్లు అందుబాటులో లేవని ఉన్నతాధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం 13 హెలికాఫ్టర్‌లను అందుబాటులో ఉంచినట్లు ఎపి భవన్ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని
వెల్లడించింది.







కామెంట్‌లు (0)