సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రాంతి కుమార్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి

21 జూన్, 2026

dmss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 07:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

– కుటుంబ సభ్యులను పరామర్శించిన డీఎస్ఎంఎం జాతీయ నాయకులు వి. శ్రీనివాసరావు

విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని దళిత శోషణ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ నాయకులు వి. శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నేపథ్యంలో ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తొలుత దీనిని సహజ మరణంగా భావించినప్పటికీ, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో ఘటన వెనుక ఉన్న పరిస్థితులు స్పష్టమయ్యాయని అన్నారు. ఆ వీడియోలో పోలీసుల వేధింపుల గురించి ప్రస్తావన ఉందని, అందువల్ల ఈ కేసుపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. విచారణ పేరుతో పేదలు, దళితులను పోలీసులు వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి. రమాదేవి మాట్లాడుతూ, క్రాంతి కుమార్ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజా ఉద్యమకారుడైన వెంకటేశ్వరరావు కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతగా స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, దళితుల పట్ల పోలీసు వ్యవస్థ వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. క్రాంతి కుమార్‌ను విచారణ పేరుతో పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మానసికంగా వేధించారని ఆరోపించారు. ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కేవీపీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గుండిమెడ క్రాంతికుమార్, తూర్పు సిటీ అధ్యక్షులు ఎన్. శ్యాంబాబు, ఐద్వా నాయకురాలు రత్నమాల తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు:

1. క్రాంతి కుమార్ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలి.

2. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.

3. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలి.

4. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

5. దళితులపై పోలీసు వేధింపులు, వివక్షను అరికట్టే చర్యలు చేపట్టాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్