• ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
• ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలుతో విద్యారంగానికి ముప్పు
• బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
• ప్రారంభమైన అఖిల భారత కార్యవర్గ సమావేశం
• విశాఖలో విద్యార్థుల భారీ ర్యాలీ
• విద్యారంగ పరిరక్షణ కోసం హోరెత్తిన నినాదాలు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : దేశంలో గడిచిన 12 ఏళ్లకుపైగా పరిపాలన చేస్తున్నది లీకేజీల ప్రభుత్వమని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య, అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ విమర్శించారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి అజెండాతో విద్యా రంగంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నా యంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత కార్యవర్గ సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వేమన మందిరం నుంచి సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం వరకూ జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ‘సేవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్’, లీకేజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి’ అంటూ వి ద్యార్ధులు చేసిన నినాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. అనంతరం గురజాడ కళాక్ష్రేతంలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సృజన్ భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ విద్య తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే 1.20 లక్షల ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారానే దేశ భవిష్యత్‌ను, రాజ్యాంగ విలువలను పరిరక్షించగలుగుతామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు నిధులు కోత విధించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నీట్ ప్రశ్నాప్రతం లీక్, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) నిర్వహణలో లోపాలు, సిబిఎస్‌ఇ మూల్యాంకన సమస్యలు, యుజిసి నెట్, సియుఇటి పరీక్షల్లో తలెత్తిన లోపాలు దేశ విద్యారంగాన్ని కుదిపేస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 51 ఐటిఐల ప్రైవేటీకరణ, ఎపి, తెలంగాణలో టీచర్ పోస్టులు భర్తీకాకపోవడం, అసోంలో ఉన్నత విద్యాసంస్థలకు నిధుల కోత వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విద్యారంగంలో ఆర్‌ఎస్‌ఎస్- బిజెపి అజెండా అమలవుతోందని అన్నారు. ఒకప్పుడు బిజెపికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారని, నేడు ఆ పార్టీతో కలిసిపోయి పనిచేయడంతో దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ముప్పు పెరిగిందని అన్నారు. దేశ రాజ్యాంగం, ప్రభుత్వ విద్య పరిరక్షణకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ మాట్లాడుతూ దేశంలో నీట్, సిబిఎస్‌ఇల్లో జరిగిన అవకతవకలపై ఎస్‌ఎఫ్‌ఐ 24 రాష్ర్టాల్లో 800కుపైగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వేలాది మంది విద్యార్థులను పోలీసులు ఈ సందర్భంగా నిర్బంధించారని తెలిపారు. 16 మంది విద్యార్థులను జైళ్లకు పంపారన్నారు. కేంద్రంలో బిజెపితో కలిసిపోయిన ఎపిలోని ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యావ్యవస్థను బలహీనం చేస్తోందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలతో దేశంలో 22 లక్షల మందికిపైగా విద్యార్థులు, సిబిఎస్‌ఇ మూల్యాంకణ లోపాలతో 16 లక్షల మందికిపైగా విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్యావ్యవస్థపై ఉన్మాద దాడులకు తెగబడుతున్నాయన్నారు. విద్య కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లకుండా ఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతోందన్నారు. సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి జి.అజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్ రావు, కె.ప్రసన్న కుమార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, విశాఖ జిల్లా గర్ల్స్ కన్వీనర్ మౌనిక మాట్లాడారు. వేదికపై సంఘం అఖిల భారత, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ర్యాలీ, సభ ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్తేజంగా సాగాయి.







కామెంట్‌లు (0)