సువర్ణపురి దేశానికి
రాజు విచిత్ర వీర్యుడు
ప్రజల కోసం నిత్యమూ
తపించి పోవు ధీరుడు
ఒకసారి రాజ్యములో
దొంగల భయమాయెను
ప్రతిరోజూ ఒక్కచోట
దొంగతనం జరిగెను
మంత్రితో మాటలాడి
గస్తీ సైనికులను పెట్టి
అభయమిచ్చె ఆ రాజు
రాత్రి కాపలాను పెట్టి
సైనికులు ఎందరున్న
దోపిడీలు ఆగవాయే
సైనికుల కళ్లుగప్పి
దోచుకునే దొంగలాయె
మహారాజు ఆలోచించి
పథక రచన చేసెను
మారువేషమున తానె
కాపలాగా పోయెను
రాత్రివేళ మహారాజు
నక్కినక్కి నడవగ
గస్తీ సైనికుడు చూసి
మాటు వేసి మీద పడె
ఓరి దొంగ ఇన్నినాళ్ళు
చెమటలు పట్టించావు
ఇప్పుడు మా రాజు వేయు
శిక్షనేమో చవిచూడు
అనుకుంటూ ఆ భటులు
పెడరెక్కలు విరిచి కట్టి
నోటను గుడ్డల కుక్కి
రాజు మాట వినరాయె
రాత్రివేళ రాజుగార్ని
భవనానికి చేర్చినారు
మంత్రితో గజదొంగను
పట్టేమని చూపినారు
కట్లు విప్పి చూడగానే
మహారాజు కనిపించె
గస్తీ భటులిద్దరికీ
గుండె ఆగి నట్టాయెను
వేషములో మిమ్ములను
కనిపెట్టలేక మేము
దొంగలాగ వెడుతుంటే
దొంగే అని తలచాము
మన్నింపుము మహారాజ
అంటూ కాళ్ళపై పడిరి
భటులను లేవదీసి
ప్రశంసించె మహారాజు
కాపలా ఇలాగె ఉంటే
కచ్చితంగ దొంగ దొరకు
అవకాశం ఇవ్వకుండా
మాటు వేయమని పంపె
కొద్ది రోజుల అనంతరం
చీకటి గల ఒకవీధిలో
నక్కి నక్కి వెడుతున్న
ఒక వ్యక్తి చూసినారు
ఓహో మన రాజుగారు
మళ్ళీ వచ్చెను చూడు
అనుకుంటూ గస్తీ వారు
మరోపక్క పోయినారు
వేషములో ఉన్నదొంగ
వీధిని దోచేసినాడు
బాధన్నది లేకుండగ
నెమ్మదిగా పోయినాడు
భటులను పిలిచె రాజు
వివరాలు అడిగాడు.
ఆ వీధిన మీరనుండగ
మేమెందుకు అనుకుంటూ
పక్క వీధిలోకి పోయి
రాత్రంతా తిరిగామని
వివరంగా చెప్పి భటులు
తప్పు తమది కాదనిరి
వివేకంతో మెలిగి రాజు
మంత్రితో మాట్లాడినాడు
దొంగను పట్టినవారికి
బహుమతి ప్రకటించాడు
ప్రజలంతా కాపలాగా
వీధులలో తిరిగారు.
దోపిడీలు కుదరదని
దొంగలంత పోయినారు
- కూచిమంచి నాగేంద్ర,
ఈస్ట్ పాయింట్ కాలనీ, విశాఖ,
91821 27880.







కామెంట్‌లు (0)