దీర్ఘకాల అశాంతి, హింస మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనడానికి కాశ్మీర్ సాక్ష్యం. ఉగ్రవాదులు, ఆర్మీ దాడుల్లో ఎందరో యువత కనిపించకుండా పోవడం, హతమారడం అక్కడ నిత్య కృత్యం. అలాంటిచోట చాలామంది మహిళలు 'అర్ధ వితంతువులు' (భర్త చనిపోయాడో, లేదో తెలియని వారిని అలా పిలుస్తున్నారు)గా చలామణి అవ్వడం ఎప్పటి నుండో ఉంది. తాజాగా అంతకంటే భయంకరమైన విషయం ఒకటి వెలుగుచూసింది. పార్లమెంటులో భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ సమర్పించిన నివేదిక ప్రకారం 2019 నుండి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 10 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. కనిపించకుండా పోయిన ఆ మహిళల కుటుంబాలు ఏళ్లతరబడి ఆ బాధను అనుభవిస్తున్నాయి. అయినా నేటికీ వారి ఆచూకీ లేదు. అసలు ఉన్నారో లేదో తెలియదు.
అదృశ్యాల వెనుక వేదన ...
తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, కూతురుగా ఉండాల్సిన ఆ మహిళలు ఎక్కడికి వెళ్లారు? బలవంతపు నిర్బంధం వారిని ఎన్ని చిత్రహింసలకు గురిచేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. నివేదిక ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు 9765 మంది, 18 ఏళ్ల లోపు వారు 1,148 మంది. అధికారిక లెక్కల్లోనే ఇంతమంది ఉంటే.. అనధికారికంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రిపోర్టు ప్రకారం కనిపించకుండా పోతున్న మహిళలు ఎక్కువగా కతువా జిల్లాకు చెందినవారు. ప్రతి నెలా అక్కడ 'మిస్సింగ్ ఉమెన్' కేసులు నమోదు అవుతూనే ఉంటున్నాయి. మహిళలు అదృశ్యం అవుతున్న ఉదంతాలు కాశ్మీర్‌కు కొత్త కాదు. ‘ఆమ్నేస్టి ఇంటర్నేషనల్’, ‘ఐక్యరాజ్యసమితి’, ‘యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్’, ‘కంట్రీ రిపోర్టు ఆన్ హ్యూమన్ రైట్స్’ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏళ్ల తరబడి కాశ్మీర్‌లో బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధ హత్యలు, చిత్రహింసలు, సామూహిక దహనాలు వంటివి జరుగుతున్నాయని నమోదుచేశాయి. దశాబ్దాలుగా అర్ధ వితంతువులుగా మారిపోయిన మహిళలు అక్కడ 10 వేల మందికి పైగానే ఉన్నారని గత నివేదికలు పేర్కొన్నాయి.
న్యాయం ఎప్పుడు?
ఇప్పుడు కొత్త తరం కూడా ఆ బాధను అనుభవిస్తోంది. ఇన్ని వేల మంది మహిళలు కనిపించకపోవడం ప్రాంతీయ సమస్య కాదు. హత్యలు, అత్యాచారాలకు బలౌతున్న కుటుంబాలకు న్యాయం అందడం లేదు. న్యాయం కోసం దశాబ్దాలుగా కోర్టు గుమ్మం ముందు పడిగాపులు పడడం కాశ్మీరీల దైనందిన జీవితంలో భాగం అయిపోయింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు దక్కకుండా కాశ్మీరీ మహిళలు జీవిస్తున్నారు. అదృశ్యాలు, అత్యాచారాలు, కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడాలు, స్థానభ్రంశాలు వారిని నేటికీ పట్టి పీడిస్తున్నాయి. కాశ్మీర్ సంఘర్షణ అక్కడి మహిళల్లో సామాజిక, ఆర్థిక అభద్రతకు కారణమవుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక సామాజిక, మానసిక క్షోభ వారిని వెంటాడుతోంది. ఈ పరిస్థితి నుండి ఆ మహిళలు విముక్తి అవ్వాలంటే అంతర్జాతీయ సమజం ఈ అదృశ్యాలపై దృష్టి పెట్టాలి. పారదర్శకమైన, స్వతంత్ర విచారణలు జరిగేలా పిలుపు ఇవ్వాలి. సాక్ష్యాధారాలు ఉన్న చోట పక్షపాత బుద్ధి చూపకుండా యంత్రాంగం వ్యవహరించేలా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. మానవ హక్కులు ఎంపిక చేసుకున్నవి కావు.. జాతి, మతం, కులం, రాజకీయ అనుబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా అవి వర్తించాలి. ఇవేమీ జరగకుండా అదృశ్యమైపోయిన ఆ మహిళల జాడ కనిపించదు. ఏళ్లు గడుస్తున్నా కాశ్మీర్‌ను ‘ఆ మహిళలు ఎక్కడ ఉన్నారు?’ అన్న ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది.







కామెంట్‌లు (0)