నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌తో చర్చలు
మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధానిలోని శాసనసభ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శాసనసభ భవన నిర్మాణం, అంతర్గత ఆకృతులు తదితర అంశాలపై శాసన సభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పి నారాయణతో కలిసి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధుల బృందంతో చర్చించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి నాదెండ్ల మీడియాకు వివరించారు. శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రాజధాని అమరావతి మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల ఏర్పడే మార్పులను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక అవసరాలకనుగుణంగా భవన డిజైన్లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు శాసనసభను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసన ప్రక్రియపై అవగాహన కలిగేలా, వారికి మంచి అనుభూతిని అందించేలా ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగించే సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి ఉభయ సభల సభ్యులందరూ ఒకేచోట కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేసేలా డిజైన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)