సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు ఉద్యమ నాయకులు, సిపిఎం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, మహిళా ఉద్యమ నాయకులు సుమతి ప్రజా ఉద్యమాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు తెలిపారు. వీరిద్దరి మృతి పట్ల సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన బుధవారం రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ అధ్యక్షతన జరిగిన సభలో మల్లారెడ్డి, సుమతి చిత్రపటాలకు నరసింగరావు, సిఐటియు ఆలిండియా నాయకులు జి బేబిరాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, అఖిల భారత ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతు ఉద్యమ నిర్మాణానికి విశేష కృషి చేశారన్నారు. రైతుల సమస్యలతోపాటు నీటి వనరులను అన్ని ప్రాంతాలకు అందించేందుకు ఉన్న అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారని పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆదర్శ నాయకుడని కొనియాడారు. సుమతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యమంలో ప్రముఖ నాయకురాలిగా పనిచేశారని అన్నారు. మోటూరు ఉదయం ట్రస్ట్ ఛైర్మన్‌గా సామాజిక సేవలోనూ విశేష కృషి చేశారన్నారు. ఇంజినీరింగ్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకుని, తనకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని సిపిఎంకు విరాళంగా అందించిన ఆదర్శ మహిళా నాయకులు అని కొనియాడారు. సిఐటియు రాష్ట్ర కమిటీ తరపున మల్లారెడ్డి, సుమతి కుటుంబ సభ్యులకు నరసింగరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముజఫర్ అహమ్మద్, కెఆర్‌కె మూర్తి, వివిఎల్ నరసింహులు, ప్రసాద్, దుర్గ, వరలక్ష్మి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, కార్యదర్శి సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు జిలాని, అంగన్‌వాడీ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుప్రజ, అనసూయమ్మ, ఎస్ వాణిశ్రీ, రమాదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)