సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకివీడు దళితవాడ తక్షణ చర్యలు తీసుకోవాలి

07 ఆగస్టు, 2026

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కెవిపిఎస్ డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దళితవాడ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు జెఎన్ వి గోపాలన్ కోరారు. శుక్రవారం విజయవాడలో ఎస్ సి కమిషన్ కార్యదర్శి ఎస్ రాముడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అండ్ర మల్యాద్రి మాట్లాడుతూ ఆకివీడు దళితవాడలో సుమారు 70 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత కుటుంబాల హక్కులను ఉల్లంఘిస్తూ అధికారులు అర్ధరాత్రి వేళల్లో భారీ పోలీసు బలగాలతో దళితవాడలోకి ప్రవేశించి ఇళ్ల మధ్య ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.ప్రభుత్వమే గతంలో పట్టాలు మంజూరు చేసి, ఆ స్థలాల్లో లబ్ధిదారులు తమ సొంత ఖర్చులతో పక్కా గృహాలు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తోన్న తరువాత మరల అదే ఇళ్లకు మార్కింగ్‌లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం ఏ చట్టం ప్రకారం జరుగుతోందని ప్రశ్నించారు. ఒకసారి ప్రభుత్వం భూమిపై హక్కు కల్పించిన తర్వాత ఆ హక్కులను కాలరాస్తూ అధికారులు వ్యవహరించడం దళితుల రాజ్యాంగబద్ధ హక్కులపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం సాగుతోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధి ఒత్తిళ్లకు తలొగ్గి మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు దళితులపై కులవివక్షతో వ్యవహరిస్తూరని విమర్శించారు. బాధిత 17 దళిత కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. భూమి, గృహ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ ఇనుప కంచెలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.దళితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యతన్నారు. ఆకివీడు దళితవాడలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ఎస్ సి కమిషన్ స్వయంగా విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను వెంటనే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్