కెఆర్‌పురం ఐటిడిఎ ముట్టడి
ప్రజాశక్తి - బుట్టాయగూడెం : ఆదివాసీల హక్కుల పరిరక్షణ, జిఒ నంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదంతొక్కారు. బుధవారం కెఆర్‌పురం ఐటిడిఎ వద్ద నిర్వహించిన ఆదివాసీ గర్జన ర్యాలీకి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఐటిడిఎ వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించి గిరిజనులను గేటు వద్దే అడ్డుకున్నాయి. దీంతో ఆదివాసీలు అక్కడే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.అశోక్, గిరిజన సంఘ నాయకురాలు మొడియం నాగమణి, ఆదివాసీ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య, జిఎస్‌పి జిల్లా నాయకులు రమేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ముక్కయ్య, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, జాతీయ ఆదివాసీ పాస్టర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఫిలిప్స్ తదితరులు ప్రసంగించారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జిఒ నంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలస్యం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఆగస్టు తొమ్మిది లోపు జిఒ నంబర్ 3పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆదివాసీల హక్కుల సాధనకు నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ధర్నా వద్దకు చేరుకున్న ఐటిడిఎ పిఒ కె రాములు నాయక్ వినతిపత్రం తీసుకుని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పండా కృష్ణ మూర్తి, ఎస్ అబ్బాయి రెడ్డి, కారం భాస్కర్, పోలోజు నాగేశ్వరరావు, సుండ్రు బుల్లెమ్మ, మాజీ సర్పంచులు ఉకే బొజ్జి, కొమరం సత్యనారాయణ, ఆదివాసీలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)