ఐషీ ఘోష్ అక్రమ అరెస్ట్ యత్నంపై అమిత్ షా స్పందించాలి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్)లోకి చొరబడి విద్యార్థి నేత ఐషీ ఘోష్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసేందుకు యత్నించిన ఢిల్లీ పోలీసుల చర్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీల నేతలందరు అందోళన వ్యక్తం చేశారు. వామపక్ష ఎంపిలతో పాటు, తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, డిఎంకె ఎంపిలు కూడా పార్లమెంటు ఆవరణంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి ఐషీఘోష్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం లోక్‌సభ నేత కె. రాధాకృష్ణన్, రాజ్యసభ నేత జాన్ బ్రిట్టాస్, ఎంపి వి. శివదాసన్ నోటీసులు ఇచ్చారు.
సిగ్గుచేటు : ఖర్గే
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఐషీఘోష్‌పై పోలీసుల చర్యను తీవ్రంగా విమర్శించారు. ‘ఢిల్లీ పోలీసుల చర్య సిగ్గుచేటు. పోలీసులు లేదా సిబిఐ ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటే, ఈ దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం సురక్షితంగా లేవని అర్థం. సిపిఎం కార్యాలయంపై దాడి చేసిన పోలీసు అధికారులను శిక్షించాలి. ఇలాంటి పనులు చేయమని వారికి ఎవరు ఆదేశించారో ప్రభుత్వం వివరించాలి’ అని ఖర్గే డిమాండ్ చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు.
అమిత్ షాదే భాద్యత..
సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ ఎకెజి భవన్‌లోకి చొరబడి ఐషీఘోష్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసే చర్యపై హోం మంత్రి అమిత్ షా భాద్యత వహించాలన్నారు. ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. దేశ యువతను భయభ్రాంతులకు గురిచేయాలనే కేంద్ర ప్రభుత్వ అజెండాను అమలు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే, వారిని ఎవరూ ఆపి ఉండేవారు కాదని, యూనిఫాం లేదా నేమ్‌ప్లేట్ లేకుండా జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షురాలిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారని జాన్ బ్రిట్టాస్ అన్నారు. జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతున్నప్పుడు, పార్లమెంట్ కార్యకలాపాలను ప్రసారం చేస్తున్న సంసద్ టివి కెమెరాలు ఆయనపై కాకుండా అధికార పార్టీపై దృష్టి సారించాయి, ఇది నిరసనలకు దారితీసింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయాలను ప్రతిపక్ష సభ్యులు చెప్పినప్పుడు ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఉందని జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు.
జెపి నడ్డా సమర్ధన
అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి, సభా నాయకుడు జెపి నడ్డా ఢిల్లీ పోలీసుల చట్టవిరుద్ధ చర్యను సమర్థించారు. 'విద్యార్థి నాయకులు ఏ క్షణం లోనైనా అరెస్టుకు సిద్ధంగా ఉండాలి. ఎమర్జెన్సీ సమయంలో నన్ను రెండుసార్లు తరగతి గది నుండి బయటకు పిలిచి, అరెస్ట్ చేశారు’ అని ఆయన చెప్పారు.
‘దేశంలో ఎమర్జెన్సీ ఉందా?’: ఐషీఘోష్
దేశంలో ఎమర్జెన్సీ ఉందో లేదో కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించాలని ఐషీ ఘోష్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీ పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను సమర్థించుకునే క్రమంలో, కేంద్ర మంత్రి జెపి నడ్డా, ఎమర్జెన్సీ సమయంలో తనను అరెస్టు చేశారని, అది సరైనదేనని అనడాన్ని ఆమె ప్రస్తావిస్తూ దేశంలో ఇప్పుడు అత్యవసర పరిస్థితి లాంటిదే నెలకొని ఉందని కేంద్ర ప్రభుత్వమే ధృవీకరిస్తోందా? అనిప్రశ్నించారు.






కామెంట్‌లు (0)