బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచట్టబద్ధ పనులు ప్రభుత్వ అధికారులే చేయాలి!

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 11:52 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ప్రైవేటీకరణపై హైకోర్టు

  • ఆర్‌ఎస్‌కేల అధికారాలపై స్పష్టత ఇవ్వాలని *రాష్ట్రానికి నోటీసులు

​ప్రజాశక్తి-అమరావతి : ‘రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు మినిస్టీరియల్‌ పనులకే పరిమితం కావాలి. చట్టబద్ధ అధికారాలు వినియోగించే బాధ్యతలు ప్రభుత్వ అధికారులే నిర్వర్తించాలి.’ అని హై కోర్టు ధర్మాసనం పేర్కొంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్వహణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతి జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు) ఏర్పాటు చేసి, వాటిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సామాజిక కార్యకర్త పాముల బలరాం దాఖలు చేసిన పిల్‌ ‌విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. విచారణ సందర్భంగా ఆర్‌ఎస్‌కేలు ప్రజలకు అందించే సేవల స్వరూపం, వాటి అధికార పరిధిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్‌ఎస్‌కేలు అందించే సేవలు, ప్రభుత్వ అధికారులు నిర్వహించే విధులు ఏమిటో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పీపీపీ విధానంపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పిటిషనర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు విస్తృత వాదనలు వినిపించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కే) పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) విధానంలో నిర్వహించే నిర్ణయం చట్టబద్ధం కాదన్నారు. రిజిస్ట్రేషన్ వంటి సార్వభౌమ అధికారాలకు సంబంధించిన సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రస్తుత చట్టాలకు విరుద్ధమని వాదించారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నిర్వహించే అధికారిక విధులను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఇలాంటి కీలక మార్పు చేయాలంటే ముందుగా శాసనసభలో సంబంధిత చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుందని, కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ.) ఆధారంగా విధానాన్ని అమలు చేయడం చట్టబద్ధం కాదని ఆయన వాదించారు. దీనిని చట్ట వ్యతిరేక విధానమని ప్రకటించాలని కోరారు. పిపిపి విధానం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా, ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.2,000 వరకు ఫెసిలిటేషన్ ఛార్జీ విధించే అవకాశం ఉండటంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిందే తప్ప, ప్రైవేటీకరణ పరిష్కారం కాదని వాదించారు. ప్రైవేట్ సంస్థల జోక్యంతో అవినీతి, అక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఆస్తులకు సంబంధించిన సున్నితమైన సమాచారం, వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ డేటా భద్రతపై కూడా తీవ్రమైన సందేహాలు నెలకొంటాయని తెలిపారు. ప్రజల గోప్యత, డేటా రక్షణకు ఇది ముప్పుగా మారవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో జి.ఓ.ఎం.ఎస్. నెం.396 అమలును నిలిపివేసి, ఇప్పటివరకు ఉన్న విధంగానే ప్రభుత్వ అధికారుల ద్వారానే రిజిస్ట్రేషన్ సేవలను కొనసాగించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రైవేటీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. చట్టబద్ధ అధికారాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో తీవ్ర అవకతవకలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకే ఆస్తిపై బహుళ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఈ పరిస్థితిలో ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే ప్రజల ఆస్తులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, న్యాయపరమైన వివాదాలకు తెర తీసినట్టు అవుతుందని, కోర్టు కేసులతో జనం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ, ఆర్‌ఎస్‌కేల ఏర్పాటు ప్రైవేటీకరణ కాదని అన్నారు. ప్రజలకు సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, అధికారిక నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ప్రభుత్వ అధికారులకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్