సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల
జాబ్ కేలండర్-2026 సమీక్షలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాబ్ కేలండర్-2026లో భాగంగా రెండో దశలో 3,168 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాబ్ కేలండర్-2026పై లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జాబ్ కేలండర్-26లో విడుదల చేసిన 10,060 ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి దశ కింద వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. రెండో దశ కింద 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని తెలిపారు. 3,4 దశల్లో ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూడో దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు.
రెండో దశలోని 2,388 ఉద్యోగాల్లో 2,225 పోస్టులు హోంశాఖలో భర్తీ చేయనునట్లు వెల్లడించారు. గ్రూప్-1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సమావేశంలో మంత్రుల బృందం అభిప్రాయపడింది.ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 పూర్తి ఖాళీల వివరాలను ఆరో తేదీన జరిగే కేబినెట్ ముందు ప్రవేశపెట్టనునట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, ఎపిపిఎస్సి కార్యదర్శి పి రవి సుభాష్, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)