శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో ఏఐ-ఆధారిత టూరిజం : పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

3 రోజుల క్రితం

ai tourism
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 05:43 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ‘నివు ఏఐ’ సేవలు

- ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం : మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో ప్రముఖ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్' రూపొందించిన ‘నివు ఏఐ’ (NiVU AI) (NiVU AI- Neural Intelligence Vernacular Unified Model) ప్లాట్‌ఫారమ్ వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ (APTA) మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ అమ్రపాలి కాట, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పనితీరు బాగుంటే కాలపరిమితిని పొడిగించే అవకాశమున్నట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో, మూడేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. దీని వల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటకుల ప్రాధాన్యతలు, భాషలు, ప్రవర్తనా సరళిని విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఏపీటీఏకు రియల్-టైమ్ అనలిటిక్స్ లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుందో లైవ్ లో టెస్ట్ చేసి చూపించారు. ASK AI పేరుతో ఉన్న క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్, సెక్రటరీ అజయ్ జైన్ స్వయంగా ఏఐ టెక్నాలజీ ని వినియోగించి స్వయంగా సంభాషించారు.. పర్యాటక ప్రాంతాల విశేషాలను మీడియా ప్రతినిధుల ఎదుట తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ప్రకారం పర్యాటకులు రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని కోటలు, బీచ్‌లు, చారిత్రక కట్టడాలు మరియు దేవాలయాల వద్ద ఏర్పాటు చేసే క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ‘నివు ఏఐ’తో నేరుగా సంభాషించవచ్చని వివరించారు. వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో 130కు పైగా భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి మరియు ప్రాముఖ్యతను పర్యాటకులు తెలుసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ముందు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలలో పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఈ ఏఐ సేవలను ఉపయోగించుకుంటూ, తమకు నచ్చిన భాషల్లో ఆలయ విశిష్టతను, పూజా విధానాలను తెలుసుకుని అద్భుతమైన స్పందన అందించారని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలోని 'స్వర్ణాంధ్ర విజన్-2047' లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. స్థానిక తెలుగు భక్తుల నుండి అంతర్జాతీయ పర్యాటకుల వరకు ప్రతి ఒక్కరికీ మన సంస్కృతి, వారసత్వాన్ని వారి సొంత భాషలోనే వివరించే అద్భుతమైన సాంకేతికత ఇది అని, తానే స్వయంగా ఈ 'నివు ఏఐ'ని తెలుగులో పరీక్షించానని, ఇది ఎంతో ఖచ్చితత్వంతో, గౌరవపూర్వకంగా సమాధానాలు ఇస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.. గోదావరి పుష్కరాల్లో ఇది ఎక్కువగా భక్తులకు ఉపయోగపడనుందని తెలిపారు.రెండేళ్ల కాలంలో ఏపీ పర్యాటక రంగంలో తెచ్చిన వినూత్న సంస్కరణలు, టెక్నాలజీ కి పెద్దపీట వేయడం మెచ్చి పలువురు ముందుకొస్తున్నారన్నారు.

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ఈ సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ సామాన్యుడికి, పర్యాటకుడికి సైతం అర్ధమయ్యేలా ఉందన్నారు.

ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మాట్లాడుతూ.. "ఈ భాగస్వామ్యం రెండు అద్భుతమైన రంగాలను ఒకచోటకు చేరుస్తుందని, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ వారసత్వపు లోతు కాగా రెండవది ప్రపంచ స్థాయి భారతీయ సాంకేతికత అన్నారు. రాబోయే మూడేళ్లలో, ప్రతి సందర్శకుడు ఈ రాష్ట్రాన్ని సందర్శించే అనుభవాన్ని పూర్తిగా మార్చనున్నామన్నారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని ఒక అపూర్వమైన ప్రక్రియగా కొనియాడారు.టెక్నాలజీ కి ఏపీ పెద్దపీట వేస్తుందని.. వీరిని పీఎం కార్యాలయం వారు సెలెక్ట్ చేసారని తెలిపారు. ప్రముఖ సినీనటుడు, సామాజిక సేవకర్త సోనూసూద్ ఎక్స్ ప్లర్జర్ కంపెనీలో భాగస్వామి, వాటాదారుగా ఉన్నారని పేర్కొన్నారు.

ఎక్స్‌ప్లర్జర్ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జితిన్ భాటియా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకు దక్కిన గౌరవం అన్నారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రతి ప్రధాన పర్యాటక ప్రాంతం ప్రతి సందర్శకుడితో, ప్రతి భాషలో మాట్లాడే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీఏ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. "ఆంధ్రప్రదేశ్ వారసత్వం, చరిత్ర, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై 'నివు ఏఐ' కి శిక్షణ ఇవ్వడానికి మా బృందాలు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాయి. మంగళగిరిలోని రెండు మహాక్షేత్రాలలో జరిగిన పైలట్ ప్రాజెక్ట్‌లో, ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఇప్పటికే నివు ఏఐతో మాట్లాడుతున్నారు. గౌరవంతో, శ్రద్ధతో రూపొందించిన ఈ సాంకేతికత సందర్శకులు ఆ ప్రదేశంతో కనెక్ట్ అయ్యే విధానాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుందని ఇది మాకు నిరూపించింది. రాష్ట్రంలోని ప్రతి పర్యాటక ప్రాంతంలోనూ ఇదే విధమైన లోతైన అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము." అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్