సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సవాళ్లే పరిష్కారాలు !

08 ఆగస్టు, 2026

Youth should not stop at questions; offer solutions: PM Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 02:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నిత్యవిద్యార్థిగా ఉంటేనే విజయాలు

  • ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో యువతను
ఉద్దేశించి ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయని, ఎవరైతే నిరంతరం నేర్చుకుంటారో వారే విజయాలు సాధించగలరని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. యువత నిత్య విద్యార్థుల్లాగా ఉంటూ, ఏదో ఒకటి తెలుసుకోవాలనే జిజ్ఞాసను సజీవంగా ఉంచుకోవాలన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికి, ఆ సవాళ్లే అవకాశాలుగా మారుతాయని తెలిపారు. భారత్‌ ప్రస్తుతం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని, యువత కోసం కొత్త రంగాలు ఉద్భవిస్తున్నాయని చెప్పారు. ఐఐటి-ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించారు. ఐఐటి-ఢిల్లీలో ప్రారంభించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు సెమీకండక్టర్ల రంగంలో భారత్ సత్తాను కొందరు శంకించారని, అయితే ఇప్పుడు తొలి సెమీకండక్టర్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయని, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ కూడా అనుక్షణం మారుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకటి గుర్తుంచుకోండి.. ఎవరైతే నిత్య విద్యార్థిగా ఉంటారో వారే గెలుస్తారని విద్యార్థులను ఉద్దేశించి మోడీ పేర్కొన్నారు. 'వికసిత్​ భారత్' సాకారం చేయడంలో ​యువత తీసుకునే నిర్ణయాలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థులు తమ జీవితంలో రానున్న 35 ఏళ్లలో తీసుకునే నిర్ణయాలు 'వికసిత్ భారత్' ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. ప్రతి రంగంలో స్వావలంబన అనేది వికసిత్ భారత్ అభివృద్ధికి పునాది అని మోదీ పేర్కొన్నారు. దేశంలో 'చిప్ నుంచి షిప్' వరకు ప్రతిదీ మన యువత చేతుల మీదుగానే తయారవుతుందని ఆయన తెలిపారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో 587 మంది పిహెచ్‌‌డి స్కాలర్లతో సహా మొత్తం మూడు వేల మందికి పైగా విద్యార్థులు తమ పట్టాలను అందుకున్నారు. విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, శంకర్‌దయాళ్ శర్మ స్వర్ణ పతకం, పర్‌ఫెక్ట్‌ టెన్ స్వర్ణ పతకాలను మోడీ అందజేశారు. ఇదిలా ఉండగా, స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఐఐటి ఢిల్లీ సోనిపత్‌ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత సూపర్‌ కంప్యూటింగ్‌ కేంద్రమైన 'పరం ప్రజ్ఞ'ను మోడీ ప్రారంభించారు. ఇది కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలతో పనిచేసే అత్యంత ఆధునిక హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థ అని, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్​, అంతర్విభాగ పరిశోధన రంగాల్లో సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్