- మంత్రి బిసి జనార్థన్ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్రంలోని పలు కీలక జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) అమరావతి ప్రాజెక్టు అమలు యూనిట్ ప్రాజెక్టు డైరెక్టర్ విరాజ్ సురాజ్ వాలా మంత్రిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనుల పురోగతిని మంత్రికి వివరించారు. ఐదు జిల్లాల పరిధిలో 190 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై ప్రాజెక్టు డైరెక్టర్‌ను మంత్రి ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం 2 వరసలుగా ఉన్న వినుకొండ – గుంటూరు జాతీయ రహదారిని 4 వరసలుగా విస్తరిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. మరోవైపు గుంటూరు – నిజాంపట్నం రహదారి అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించిందని, త్వరలోనే దీనిని టెక్నికల్ కమిటీ ముందుకు పంపనున్నట్లు వెల్లడించారు. అమరావతి ఒఆర్‌ఆర్ నిర్మాణం కోసం అవసరమైన ఫ్లై యాష్‌ను ఉచితంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇది ఎన్‌హెచ్‌ఎఐకి ఎంతో వెసులుబాటు కల్పించిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.








కామెంట్‌లు (0)