మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అంబేద్కర్ గురుకులాలను యథాతథంగా కొనసాగించాలి

2 రోజుల క్రితం

gurukulam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించి, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌) నాయకులు కోరారు. రెండు సంఘాలు వేర్వేరుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి లేఖలు పంపినట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్‌, కె.ప్రసస్నకుమార్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి శనివారం ప్రకటనలో తెలిపారు. ఎస్‌‌సి తదితర వెనుకబడిన విద్యార్థుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగిన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా దశాబ్దాలుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తోన్న తాడికొండ, విశాఖపట్నం (మేఘాద్రిగడ్డ), తిరుపతి జిల్లా కోటలోని డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలను మూసివేసి, విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించడం సమంజసం కాదని తెలిపారు. గురుకుల పాఠశాలలను కొనసాగిస్తూనే, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అవసరమైన కొత్త భవనాలు, ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలను కేటాయించే ఆలోచన చేయాలని కోరారు. తరలింపు నేపధ్యంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాడికొండ పాఠశాల వద్ద గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు ద్వారా నిర్బంధం చేసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రస్తుతం ఉన్న గురుకులాలను యధావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రత్యేక ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వీటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని కోరారు. కనీసం ఉమ్మడి జిల్లాకు ఒకటైనా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థుల, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్