మంత్రి రామానాయుడిని అడ్డగింత
ప్యాకేజీ అందలేదని నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం
అడ్డుకున్న పోలీసులు - అరెస్టు, ఆపై విడుదల
నిమ్మల హామీతో ఆందోళన విరమణ
ప్రజాశక్తి - మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళనతో మార్కాపురం కలెక్టరేట్ దద్దరిల్లింది. తమకు పూర్తిస్థాయి పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు అందలేదంటూ సుంకేసుల, కలనూతల, గొట్టిపడియ గ్రామాల నిర్వాసితులు సిపిఎం ఆధ్వర్యాన మార్కాపురం కలెక్టరేట్ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు కలెక్టరేట్ నుంచి బయటకు రాగానే ఆయనను చుట్టుముట్టారు. మంత్రిని కదలనీయ కుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్న తీవ్ర ఆవేదనతో పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన నిర్వాసితుడు రామా ఏడుకొండలు మంత్రి ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిర్వాసితులను పోలీసులు, అధికారులు శాంతిం పజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్వాసిత ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించానని, సిఎం కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికీ పరిహారం అందని వారి జాబితాలను సేకరించి 900 మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. వారికి అవార్డు పాస్ చేస్తున్నట్లు, వీలైనంత తొందరలో ప్యాకేజీ పైకం బ్యాంకు ఖాతాలో జమ కానుందని తెలిపారు. మిగిలిపోయిన పొలాలకు, గృహాలకు కూడా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు, జిఎంపిఎస్ రాష్ట్ర నాయకులు పూసపాటి వెంకటరావు తదితరులు మాట్లాడారు. చివరి నిర్వాసితుడి వరకూ ప్రభుత్వం ప్యాకేజీ అందించాల్సిందేనని పట్టుబట్టారు. నిర్వాసితుల సమస్యలు తీర్చిన తర్వాతనే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మించుకున్న 270 గృహాలకు పరిహారం అందాలని, ప్యాకేజీ జాబితాలో మిస్సయిన కుటుంబాలు వెయ్యికి పైగా ఉన్నాయని చెప్పారు. వందలాది మందికి ప్యాకేజీ అందకుండా ప్రాజెక్టు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తక్షణమే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని ఆదుకోని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన నిర్వాసితుడు రామా ఏడుకొండలు పుట్టి పెరిగింది అదే గ్రామం. ఆ గ్రామంలో ఎస్‌కె 410 ఇంటి నెంబరుగా అధికారులు గుర్తించారు. ఏడుకొండలు కుటుంబానికి ప్యాకేజీ పరిహారం అందాల్సి ఉంది. అదే ఇంటి నెంబరుతో పరిహారం ఓ అనర్హుడికి జమ చేశారు. ఈ విషయమై సంవత్సరాల తరబడి తనకు అన్యాయం జరుగుతోందని వేడుకున్నా పట్టించుకున్నవారే లేరు. గ్రామం ఖాళీ చేసి వెళ్లేటప్పుడు కూడా తన గురించి పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన ఏడుకొండలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు. పోలీసు వాహనాన్ని నిర్వాసితులు అడ్డుకున్నారు. చివరకు పోలీస్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిర్వాసితుల ఆందోళనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విజయ్, వందన కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి, పలువురు సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)