ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో చికిత్స పొందుతూ మరో మహిళ మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న చౌటుపల్లి సుబ్బులు (58) శనివారం మధ్యాహ్నం మరణించారు. సుబ్బులు భర్త గతంలోనే చనిపోయారు. భౌతికకాయాన్ని స్వగ్రామైన చిలకలూరిపేట మండలం వేలూరుకు తరలించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో సిపిఐ ఏరియా కార్యదర్శి టి.బాబురావు, ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, మాజీ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, సిపిఐ గ్రామ కార్యదర్శి ఏలిక శ్రీనివాసరావు, నాయకులు బి.ధనరాజ్ ఉన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం : ప్రకటించిన సిఎం చంద్రబాబు
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27న విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో వేలూరి గ్రామానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.







కామెంట్‌లు (0)