సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి

1 గంట క్రితం

krishna 3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 01:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు

  • కృష్ణా జిల్లా కలెక్టరేట్‌ వద్ద జైలు భరో

ప్రజాశక్తి కలెక్టరేట్‌ (కృష్ణా): కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు, జైలు భరో కార్యక్రమంలో భాగంగా ఎస్‌కేఎం, కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించగా, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లోకి అనుమతించాలని, లేదంటే తమను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. జైలు భరో కార్యక్రమంలో భాగంగా తమను అరెస్ట్‌ చేయాలని కోరినప్పటికీ పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో స్వచ్ఛందంగా జైలు భరో చేసేందుకు మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బైఠాయించారు. అయితే వారిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అసమర్థ పాలన సాగిస్తోందని విమర్శించారు. కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను హరిస్తోందని ఆరోపించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌, పోలీస్‌స్టేషన్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జైలు భరో కార్యక్రమాన్ని ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నించిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రైతు, కౌలురైతు, సీఐటీయూ, ఏఐఎఫ్‌టీయూ (న్యూ), ఐద్వా, ఏఐటీయూసీ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

krishna 3

krishna 3

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్