విద్యార్థులను బిజెపి రెచ్చగొడుతోందన్న జార్ఖండ్ ప్రభుత్వం
రాంచీ : జార్ఖండ్‌లో నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. జార్ఖండ్‌లో నియామక పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది యువత సోమవారం అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు బారికేడ్లను దాటుకుని అసెంబ్లీ వైపు దూసుకువెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. పరీక్షల అక్రమాలకు నిరసనగా గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 'జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా' నేత దేవేంద్ర నాథ్ మహతో కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆయన 10.5 కిలోల బరువు తగ్గారు. అయినప్పటికీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ చిత్రపటాన్ని పట్టుకుని కనిపించారు.
చర్చలతోనే పరిష్కారం కనుగొంటామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదివారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆరోసారి విద్యార్థుల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల అనంతరం 14వ జేపీఎస్సీ సంయుక్త సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షతో సహా మూడు పరీక్షలను రద్దు చేసేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం అంగీకరించింది. అయినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)కి చెందిన ముగ్గురు సభ్యులు కూడా ఆదివారం రాజీనామా చేశారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా విద్యార్ధులు చేసిన పలు ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్ పరీక్షలో జరిగిన అవతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణకు ఆదేశించేంత వరకు ఈ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో రాంచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. బిజెపి విద్యార్థులను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని జార్ఖండ్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ విమర్శించారు.








కామెంట్‌లు (0)