ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)-యుజి-2026ను రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగ, సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. నీట్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పరీక్షా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయగా, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని ఎస్పిలను ఆదేశించారు.అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకునేలా చూడాలని ఆదేశించారు. పరీక్ష రోజు ఉదయం 11 గంటల నుండి అభ్యర్థులు తమ కేంద్రాలకు రిపోర్ట్ చేయాలని వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్ధులను లోపలికి అనుమతించబోమని ప్రకటించారు. పరీక్షకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మొదని, వాటిని ప్రచారం చేయవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్, నీట్ రాష్ట్ర నోడల్ అధికారి నారాయణ భరత్ గుప్తా, అబ్జర్వర్ సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరగనున్న నీట్‌కు రాష్ర్టం నుంచి 65,790 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రంలోని 27 నగరాల్లో 185 పరీక్ష కేంద్రాలను ఎన్టీఎ ఏర్పాటు చేసింది. అభ్యర్ధులు సందేహాలు కోసం 7893523455 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొంది.








కామెంట్‌లు (0)