రంగంలో దిగిన అధికారులు
ప్రజాశక్తి-బాపట్ల : నిరుపేద కుటుంబాల్లో అధిక సంతానం కలిగిన తల్లిదండ్రులను ఎంపిక చేసుకుని వారి పిల్లలను ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్న దారుణం తాజాగా బాపట్ల పట్టణం రాజీవ్ గాంధీ కాలనీలో వెలుగు చూసింది. దీనిపై జిల్లా బాలల సంరక్షణ అధికారి (డిసిపిఒ) పురుషోత్తం విచారణ చేపట్టారు. పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో ఐదుగురు పిల్లలను అమ్ముకున్నారనే సమాచారంతో విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇతర ప్రాంతం నుండి ఇక్కడికి ఓ వ్యక్తి వచ్చి పిల్లలను తీసుకుని వెళ్లి అప్పికట్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య పరీక్షలు చేయించిన అనంతరం విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. కాలనీలో ఎస్‌టిలు(యానాదులు) నివసిస్తున్నారని, పేదరికంతో వారిని పోషించలేక అమ్ముకుంటున్నారని తెలుస్తోందన్నారు. వీటన్నింటికీ సూత్రధారి ఓ ఎఎన్ఎం అని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఇక్కడి వారంతా వలస కార్మికులుగా జీవనం సాగిస్తున్నారని, ప్రస్తుతం కొంతమంది ఇళ్లలో లేరని, కూలి పనులకు హంసలదీవి ప్రాంతానికి వెళ్లారని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.








కామెంట్‌లు (0)