mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటికీ తెరుచుకోని పాఠశాలలు

3 గంటల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 01:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- హుకుంపేట మండలంలో సమస్య తీవ్రం

ప్రజాశక్తి - హుకుంపేట (అల్లూరి జిల్లా)

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైనా అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో నేటికీ ఐదు పాఠశాలలకు తాళం వేసే ఉంది. దీంతో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత ఉపాధ్యాయులు లేకపోవడం, సిఆర్‌‌టిల రెన్యూవల్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో పాఠశాలలు తెరుచుకోలేదు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టం పంచాయతీ అమనగిరి జిపిఎస్‌‌టిడబ్ల్యూ పాఠశాలలో 76 మంది, కోడితల గ్రామ పాఠశాలలో 27 మంది, బూర్జ పంచాయతీ ఎగ సల్తాంగిలో 22 మంది, చికుమద్దుల పంచాయతీ గుమ్మడిగుంట పాఠశాలలో 14 మంది, గత్తుం హెడ్‌క్వార్టర్స్ పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు రోజూ వస్తున్నా తాళం వేసే ఉండటంతో కాసేపు ఆడుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను ప్రారంభించాలని అని స్థానికులు కోరుతున్నారు.

​నిలిచిన అడ్మిషన్లు, టిసిల జారీ ప్రక్రియ

పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ఒకటో తరగతి ప్రవేశాలు, ఐదో తరగతి పూర్తి చేసి ఇతర పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల టిసిలు, స్టడీ సర్టిఫికెట్ల జారీ వంటి కీలక ప్రక్రియలు నిలిచిపోయాయి.


​​​​ఉపాధ్యాయుల కొరత నిజమే

మండలంలో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉంది. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ బోధన నిర్వహిస్తున్నాం. తాజా సమస్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- కూడా ఈశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి, హుకుంపేట

సిఆర్‌‌టిలను రెన్యూవల్‌ ‌చేయాలి

మండలంలో పనిచేస్తున్న ఆరుగురు సిఆర్‌‌టిలను రెన్యువల్‌ ‌చేయలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడమే అందుకు కారణం. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులను సంప్రదించగా ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకూ విధులకు వెళ్లవద్దని చెప్పారు. పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నాం. మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు కూడా నేటికీ అందలేదు. రెన్యూవల్ చేయకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం స్పందించాలి.

- దళపతి మోహన్, సిఆర్‌‌టిల సంఘం జిల్లా అధ్యక్షులు

తక్షణమే సమస్యను పరిష్కరించాలి

ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే అక్షరాస్యత శాతం తక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభం కాకపోవడం ఆందోళనకర పరిణామం. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి. సిఆర్‌‌టిలను రెన్యువల్‌ ‌చేయడంతో పాటు శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకోవాలి.

టి.కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్