ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు విక్రయాల్లో మెరుగైన పరిస్థితులు

6 రోజుల క్రితం

achnna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కె.అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పొగాకు విక్రయాలకు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 4 నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల ఎఫ్‌‌సివి పొగాకు విక్రయాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుత సీజన్‌కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా, అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. ఇప్పటివరకు నమోదైన సగటు ధర కిలోకు రూ.209.83గా ఉందని వెల్లడించారు. గత ఏడాది ఇదే 132 వేలం రోజుల నాటికి 140.27 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరగ్గా, తుది సగటు ధర కిలోకు రూ.248.86గా నమోదైందని పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో మిగులు ఏర్పడటంతో కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ, ఇటీవల వేలాల్లో కొనుగోలుదారుల స్పందన, పోటీ గణనీయంగా మెరుగుపడుతున్నాయని వెల్లడించారు. ఇటీవల వేలం కేంద్రాల్లో ‘నో-బిడ్’ బేల్స్ శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా సగటున 11–12 శాతం వరకు ‘నో-బిడ్’లు నమోదవుతున్నాయని, కొన్ని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో ఇది 1–2 శాతం కంటే కూడా తక్కువగా ఉందన్నారు. ‘నో-బిడ్’లు తగ్గడం, కొనుగోలు కార్యకలాపాలు పెరగడం, కొనుగోలుదారుల మధ్య పోటీ మెరుగుపడటం మార్కెట్‌లో సానుకూల సంకేతాలని తెలిపారు. ప్రస్తుతం వారానికి సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అవుతోందని పేర్కొన్నారు. కొనుగోలుదారుల మధ్య పెరుగుతున్న పోటీ మెరుగైన ధరల సాధనకు దోహదపడుతోందన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్